లక్నో: ఓ వ్యక్తి దగ్గర నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన ఇద్దరు దొంగలు ఏటీఎం పిన్ నంబర్ కోసం వచ్చి పోలీసుల చేతికి చిక్కారు. ఈ సంఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం రాత్రి ఓ వ్యక్తి డిన్నర్ చేయడం కోసం బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి.. సదరు వ్యక్తిని గన్‌తో బెదిరించారు. అతడి వద్ద నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. దానిలో బాధితుడి ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డు ఉన్నాయి. కొద్ది దూరం వెళ్లిన నిందితులు వెనక్కి వచ్చి.. ఏటీఎం పిన్ నంబర్ చెప్పాల్సిందిగా బాధితుడిని బెదిరించారు. అది తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ విషయం గురించి బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు నిందితుల బైక్‌ను అడ్డుకున్నారు. దాంతో పోలీసుల మీద కాల్పులకు తెగ బడ్డారు. (లారీ చోరీ చేసి..కరోనా పరీక్షకు)
దీని గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. ‘చెక్ చేయాలి.. బైక్‌ను ఆపాల్సిందిగా నిందితులకు చెప్పాం. కానీ వారు పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో అధికారులు కూడా కాల్పులు జరపడంతో వారికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాం’ అని తెలిపారు. నిందితులిద్దరిని గౌరవ్ సింగ్, సదానంద్‌గా గుర్తించారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.3200 నగదు, ఏటీఎం కార్డ్, పర్స్‌తో పాటు రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment