సాక్షి, హైదరాబాద్: చెన్నై కేంద్రంగా 2009లో చోటుచేసుకున్న నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్)తో మొదలుపెట్టి నగరంలో జరిగిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల వరకు దాదాపు పది కుంభకోణాల్లో నిందితుడిగా సాయి కుమార్‌కు పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. సీబీఐ విచారణ, దర్యాప్తులనూ చూసి ఉండటంతో మరింత రాటుతేలాడు. ఈ నేపథ్యంలోనే తాము పట్టుబడినా నేరానికి సంబంధించిన ఆధారాలు సాధ్యమైనంత వరకు పోలీసులకు దొరక్కుండా పథకం వేశాడు.
ఈ నెల 6న ఇతడు అరెస్టు కావడానికి పది రోజుల ముందు తనతోపాటు తన అనుచరుల ఫోన్లనూ ధ్వంసం చేశాడు. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో ఈ విషయం గుర్తించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు తెలుగు అకాడమీ కేసులో మరో సెక్షన్ జోడించాలని నిర్ణయించారు.
సాయితోపాటు అతడి ముఠా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పథకం ప్రకారం అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లు కాజేసింది. ఈ సమయంలో తన అనుచరులైన వెంకట రమణ, సోమశేఖర్ సహా ఇతరులతో సంప్రదింపులు జరపడానికి కొత్త ఫోన్, సిమ్ తీసుకున్నాడు. అయినప్పటికీ సమాచారమార్పిడి, సంప్రదింపులకు వివిధ సోషల్‌మీడియా కమ్యూనికేషన్ యాప్స్‌నే వాడాడు.
తెలుగు అకాడమీ స్కామ్ వెలుగులోకి వచ్చి సీసీఎస్‌లో కేసులు నమోదైన తర్వాత తన గ్యాంగ్‌లోని ముఖ్య అనుచరులైన ముగ్గురితో కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్‌లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అక్కడే అందరి ఫోన్లు తీసుకున్న సాయి తన దాంతోపాటు వాటినీ ధ్వంసం చేశాడు. అవి వాళ్ల దగ్గరే ఉంటే మరో సిమ్ వేసుకుని వాడతారని, అలా చేస్తే పోలీసులు కనిపెట్టడంతోపాటు ఆధారాలు సేకరిస్తారని ఇలా చేశాడు. పోలీసులు వీరిని అరెస్టు చేస్తే ఫోన్లలో తనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఈ పని చేశాడని అధికారులు చెప్తున్నారు. అప్పటి నుంచి సాయి కొన్ని రోజులు ఫోన్ లేకుండానే గడిపాడు.
అరెస్టుకు ఒకరోజు ముందు
సాయి తాను అరెస్టు కావడానికి ఒకరోజు ముందు సహ నిందితుడు భూపతిరావుతో (ఆ తర్వాత ఇతడు అరెస్టు అయ్యాడు) సంప్రదింపులు జరిపాడు. దీనికోసం గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రి వద్దకు వెళ్లిన సాయి అందులో తన బంధువు చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని కలిశాడు. తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, తమ పేషెంట్ విషయంపై కుటుంబీకులతో మాట్లాడాలని అతడి ఫోన్‌ను తీసుకున్నాడు. అందులో భూపతి నంబర్ సేవ్ చేసి వాట్సాప్ కాల్ ద్వారా అతడితో మాట్లాడాడు.
ఆపై తాను సేవ్ చేసిన ఫోన్ నంబర్ డిలీట్ చేసి ఫోన్ తిరిగి ఇచ్చాడు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాడు. తాను నేరుగా ఫోన్ చేస్తే పోలీసులకు చిక్కుతాననే సాయి ఇలా చేశాడని అధికారులు చెప్తున్నారు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ సీసీఎస్ అధికారులు చాకచక్యంగా సాయిని పట్టుకున్నారు. ఫోన్ల ధ్వంసం విషయాన్ని విచారణలో గుర్తించిన పోలీసులు తెలుగు అకాడమీ కేసులో సాయిపై ఆధారాలను ధ్వంసం చేయడానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 204 కింద ఆరోపణలు జోడించాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో న్యాయస్థానానికి సమాచారం ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment