బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబరు14లోని నందినగర్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేస్తున్న ఓ యువకుడిని ఇనుపరాడ్లతో కొట్టడమే కాకుండా అడ్డు వచ్చిన వారిని సైతం విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో సినీ ఆర్ట్ డైరెక్టర్‌తో పాటు సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే... నందినగర్‌లో శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో సందీప్, మనోజ్‌లు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్నారు.
అదే సమయంలో ఓ పెంపుడు కుక్క వీరిని కరిచేందుకు రాగా సందీప్ కిందున్న రాయి తీసుకొని కుక్కను కొట్టేందుకు యత్నించగా సమీపంలో ఉన్న ఆ కుక్క యజమాని శ్రీను వారిని దుర్భాషలాడాడు. నా కుక్కను కొడతావా అంటూ చేయి చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న శ్రీను అనుచరులు వెంకటేష్, ఆవో, రాజేష్‌తో పాటు సుమారు 20 మంది రాడ్లతో అక్కడికి చేరుకొని మనోజ్, సందీప్‌లపై దాడి చేశారు. తమను కొడుతున్నారంటూ సందీప్ ఫోన్ చేయగా ఆర్ట్ డైరెక్టర్ సుదర్శన్‌తో పాటు కొరియోగ్రాఫర్ కందుకూరి అనిల్ మరో నలుగురు అక్కడికి చేరుకున్నారు.
వారు రావడంతోనే రెచ్చిపోయిన ఆకతాయిలు తమ చేతుల్లో ఉన్న రాడ్లకు పని చెప్పారు. సుదర్శన్ తల పగిలింది. అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితులు పరారీలో ఉండగా నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
చదవండి: కోవిడ్ సెంటర్ లో కరోనా బాధితురాలపై అత్యాచార యత్నం
Comments
Please login to add a commentAdd a comment