గేమింగ్‌ స్కామ్‌లో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌...! | Multi Level Marketing In Gaming Scam | Sakshi
Sakshi News home page

గేమింగ్‌ స్కామ్‌లో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌...!

Published Mon, Aug 24 2020 3:28 AM | Last Updated on Mon, Aug 24 2020 5:34 AM

Multi Level Marketing In Gaming Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ–కామర్స్‌ వ్యాపారం పేరుతో సంస్థల్ని రిజిస్టర్‌ చేసుకుని, కలర్‌ ప్రెడిక్షన్‌ గేమ్‌ ముసుగులో బెట్టింగ్‌ దందా నిర్వహించిన బీజింగ్‌ టీ పవర్‌ కంపెనీ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఈ పంథాలోనే అనేక మంది కొత్త ‘కస్టమర్ల’ను ఆకర్షించినట్లు తేల్చారు. ఈ స్కామ్‌ మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా ఆపరేషన్స్‌ హెడ్‌ యాన్‌ హూపై ప్రైజ్‌ చిట్స్‌ అండ్‌ మనీసర్క్యులేషన్‌ స్కీమ్స్‌ (బ్యానింగ్‌) యాక్ట్‌ కింద ఆరోపణలు జోడించారు.

ఈ మేరకు నాంపల్లి కోర్టుకు సమాచారం అందించారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన యాన్‌ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్‌లను తదుపరి విచారణ కోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం నాలుగు రోజులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది. 

ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు..
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు యాన్‌ హూపై ప్రైజ్‌ చిట్స్‌ అండ్‌ మనీసర్క్యులేషన్‌ స్కీమ్స్‌ (బ్యానింగ్‌) యాక్ట్‌ కింద ఆరోపణలు జోడించారు. ప్రాథమికంగా ఈ కేసుల్ని కుట్ర, మోసంతో పాటు తెలంగాణ గేమింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదు చేశారు. ఈ గ్యాంగ్‌ వారిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన యువత సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. తాము కూడా ఆ గేమ్‌ వల్లో పడి భారీగా నష్టపోయామని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు తన తల్లి వైద్యం కోసం దాచిన రూ.2.5 లక్షల్ని ఈ గేమ్‌లో నష్టపోయానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాడు. అయితే తెలంగాణలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిషేధం కాదు. దీంతో ఆయా చోట్ల కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గత వారం నుంచి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితులకు సంబంధిం చిన 30 బ్యాంకు ఖాతాలు గుర్తించి ఫ్రీజ్‌ చేశారు. వీటికి సంబంధిం చిన స్టేట్‌మెంట్స్‌ అందించాల్సిందిగా ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అవన్నీ అందిన తర్వాతే ఆర్థిక లావాదేవీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని చెప్తున్నారు. 

కీలక నిందితుల కోసం గాలింపు..
ఇక ఈ–కామర్స్‌ పేరుతో ఢిల్లీలో ఆ సంస్థల్ని రిజిస్టర్‌ చేయించిన గుర్గావ్‌ వాసులే ఈ ఖాతాలను తెరిచారని తేలింది. తాము చైనా ఈ–కామర్స్‌ యాప్స్‌ మానిటర్‌ చేస్తుంటామని, ఆ ఆదాయం ఈ ఖాతాల్లోకి వస్తుందని బ్యాంకు, పేమెంట్‌ గేట్‌వేస్‌ నిర్వాహకుల్ని నమ్మించారు. అయితే వీటిని నిర్వహించింది మాత్రం యాన్‌ హూ సహా ఆయా కంపెనీల్లోని చైనా డైరెక్టర్లే కావడం గమనార్హం. ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ వాసులు రాహుల్, హేమంత్‌ల కోసం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రాథమికంగా ఈ స్కామ్‌ రూ.1,100 కోట్లని భావించినా... ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు ఈ మొత్తం రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదు లావాదేవీలు డాకీ పే, లింక్‌ యూ పే యాప్‌ ద్వారా జరిగినట్లు చెప్తున్నారు. దీంతో వీరికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 

20 మందిని చేరిస్తే రూ.500
ఈ గేమ్‌లోకి కొత్తవారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. ఇప్పటికే ఈ గేమ్‌ ఆడుతున్నవారు లేదా దళారులు ఇచ్చే రిఫరల్‌తో మాత్రమే ఇందులోకి ఎంటర్‌ అయ్యే వీలుంటుంది. ఇలా రిఫరల్‌ కోడ్‌ ఇవ్వడం, ఒక వ్యక్తి మరికొందరిని చేర్చడం మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కిందికే వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికోసం పనిచేసే దళారులు.. ఓ వ్యక్తిని యాప్‌లోకి ఇన్వైట్‌ చేసిన తర్వాత కనీసం రూ.200 రీచార్జ్‌ చేసుకోమంటారు. ఇలా 20 మందిని ఆకర్షించి వారితో రూ.200 చొప్పున రీచార్జ్‌ చేయిస్తే వీరు రూ.500 కమీషన్‌ పొందుతున్నారు. ఇలా మనీ సర్క్యులేషన్‌ దందా నిర్వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement