ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్– మహారాష్ట్ర సర్కారు వివాదం ముదురుతోంది. ముంబై మరో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా మారిందన్న కంగనా ఆరోపణలపై.. శివసేన సర్కారు కంగనా ఆఫీసులోని కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమంటూ కూలగొట్టిన విషయం తెలిసిందే. దీంతో, కంగనా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా డ్రగ్స్ వాడేవారన్న ఆరోపణలపై శుక్రవారం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది.
మీకేమీ బాధ అనిపించడం లేదా?
సోనియాగాంధీకి కంగనా ప్రశ్న
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం ఠాక్రేను తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తన గురిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వైపు తిప్పారు. మహారాష్ట్రలోని శివసేన–కాంగ్రెస్ ప్రభుత్వం తనను వేధిస్తుంటే సాటి మహిళగా బాధ అనిపించడం లేదా అని ఆమెను ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సోనియాను కోరారు. కంగనకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరారు.
ఉద్ధవ్ సర్కార్‌పై ఫడ్నవిస్ మండిపాటు
కరోనాపై పోరు ముగిసి, కంగనాపై పోరు ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కారు యంత్రాంగం యావత్తూ కంగనాపైనే పోరాడుతోందన్నారు. ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ, కోవిడ్–19పై పోరాటంపై శ్రద్ధ చూపాలని సూచించారు.
చదవండి: కంగనను నడిపిస్తున్నది ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment