సాక్షి,పెద్దపల్లి : తోటి విద్యార్థినులతో కలిసి.. సంతోషంగా పాఠశాలకు బయల్దేరింది. వెళ్లొస్తాను.. బై అంటూ అమ్మానాన్నకు చెప్పింది. ఆ పిలుపే వారికి చివరి పిలుపు అయ్యింది. అలా బయల్దేరిందో లేదో.. అంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. విద్యార్థిని వెంట తీసుకెళ్తున్న వాటర్ బాటిల్ ఆటోలో నుంచి కింద పడడంతో దానిని అందుకునే ప్రయత్నంలో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్కలపల్లి గ్రామానికి చెందిన తన్నీరు స్వామి, రజిత దంపతులు.
వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కూతురు అమూల్య, కుమారుడు సంతానం. కుమారుడు మానసికస్థితి సరిగా లేకపోవడంతో అమూల్యను ఉన్నంతలో ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. అమూల్య గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం సమకూర్చిన టాటా మ్యాజిక్ ఆటోలో ఎప్పటిలాగే తోటి విద్యార్థినులతో కలిసి పాఠశాలకు బయల్దేరింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ టౌన్‌షిప్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే.. అమూల్యకు చెందిన వాటర్ బాటిల్ జారి రోడ్డుపై పడింది. ఆ బాటిల్ తీసుకునేందుకు ఆటో డ్రైవర్‌ను ఆపాలని చెప్పి.. వేగంగా వెళ్తున్న ఆటోలోనుంచి దిగే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయింది.
దీంతో అమూల్య (15) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. అమ్మానాన్న వెళ్లొస్తానంటూ చెప్పిన కొద్ది క్షణాల్లోనే అమూల్య మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు.
స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలి : విద్యార్థి సంఘాల ఆందోళన
కోల్‌సిటీ: పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆటోలో స్కూల్‌కు వస్తున్న అమూల్య కిందపడి మృతిచెందడంతో పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సదరు పాఠశాల వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, నాయకులు ఎలుకపల్లి సురేష్, గాజుల అవినాష్, ఇరుగురాల సూర్య, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు దుర్గా, విజయ్, ఉదయ్, సిద్దు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment