ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రొయిత్ హరిజన్
సాక్షి, భువనేశ్వర్ (జయపురం) : నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలో పాచిపోయిన బిర్యానీ తిన్న ఒక బాలిక మరణించగా మరో ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఉమ్మరకోట్ మునిసిపాలిటీ 6వ వార్డులో మంగళవారం జరిగిన ఈ సంఘటనతో బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి ఉమ్మరకోట్‌లోని 8 వ వార్డుకు చెందిన సంజు హరిజన ఇంట ఆదివారం రాత్రి బిర్యానీ వండారు. వారు తిన్నంత తిని మిగిలిన దాన్ని దాచి ఉంచారు.
సోమవారం మధ్యాహ్నం అదే వార్డుకు చెందిన లచ్చమన హరిజన్ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, మరో చిన్నారి సంజు హరిజన్ ఇంటికి వెళ్లడంతో దాచి ఉంచిన బిర్యానీని వారికి పెట్టారు. అది తిన్న లచ్చమన హరిజన్ కుమార్తెలు జయ హరిజన్, ఘాసిని హరిజన్, కుమారుడు దావూద్ హరిజన్‌లతో పాటు మరో చిన్నారి రొయిత్ హరిజన్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని వెంటనే ఉమ్మరకోట్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించగా ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపారు.
మార్గమధ్యంలో మృతి
అయితే అదే రాత్రి 7 గంటలకు ఆ చిన్నారులకు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు తీసుకు వెళ్తుండగా లచ్చమన హరిజన్ కుమార్తె జయ హరిజన్ (5) మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఘాసిని హరిజన్ (8), దావూద్ హరిజన్ (3), రొయిత్ హరిజన్ (2)లు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న ముగ్గురి ఆరోగ్యం స్థిమితంగా ఉందని, పాచిపోయిన బిర్యానీ తినడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సంతోష్ కుమార్ పండా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment