పోలీసులమంటూ ఫోన్.. నిషేధిత డ్రగ్స్ మీకు పార్సిల్ వచ్చిందంటూ బెదిరింపు
డబ్బులివ్వాలని.. మీ తప్పు లేకుంటే డబ్బు తిరిగి ఇస్తామన్న నేరగాళ్లు
వారిచ్చిన అకౌంట్‌కు రూ.40 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసిన వృద్ధురాలు
నూజివీడు : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్‌లో నివాసముండే మందపల్లి కమలాజేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలాజేసుదాసు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు.
ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్ చేసి.. తాము ముంబయి పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్ ఉందని చెప్పింది. మీకు మరో కాల్ వస్తుందంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలాజేసుదాసుకు 7831062545 నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు.
ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్‌ఫర్ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్‌టీజీఎస్ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసింది.
అనంతరం తనకు కాల్ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్ చేస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment