పాక్‌లో మ్యాచ్‌.. సిటీలో బెట్టింగ్‌  | Online Pakistan Cricket Match Betting Gang Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

పాక్‌లో మ్యాచ్‌.. సిటీలో బెట్టింగ్‌ 

Published Wed, Jun 23 2021 6:53 AM | Last Updated on Wed, Jun 23 2021 6:56 AM

Online Pakistan Cricket Match Betting Gang Arrested In Hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు, ల్యాప్‌టాప్, ఇతర ఉపకరణాలను పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్‌, పోలీసులకు పట్టుబడిన నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: అబుదాబిలోని షేక్‌ జయీద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) మ్యాచ్‌లకు నగరంలోని నిజాంపేట్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నడుస్తోంది. ఈ దందాకు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి సూత్రధారి కాగా.. పశ్చిమ గోదావరి వాసులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. సహాయకుల్లో కృష్ణా జిల్లా వ్యక్తి ఉన్నాడు.

దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు దాడి చేసి అయిదుగురు నిందితులను పట్టుకున్నారని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం వెల్లడించారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, ఇతర ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్‌ఓటీ డీసీపీ సందీప్‌తో కలిసి గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.  

ఆద్యంతం వ్యవస్థీకృతం.. 
► తూర్పు గోదావరి వాసి సోమన్నకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ అయిన లైవ్‌లైన్‌ గురు, క్రికెట్‌ మజా, లోటస్, బెట్‌–365, బెట్‌ ఫెయిర్‌లకు చెందిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కలిగి ఉన్నాడు. అంతర్జాతీయంగా వీటిని నిర్వహించే వారి నుంచి దీన్ని పొందాడు. వీటిని ఇతగాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జి.సత్యపవన్‌ కుమార్, యూఆర్‌ సతీష్‌ రాజులకు అప్పగించాడు.  

►  వీరిద్దరూ నగరానికి చేరుకుని నిజాంపేట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బెట్టింగ్‌ బోర్డ్, ల్యాప్‌టాప్, టీవీ తదితరాలు ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్‌ బోర్డ్‌లో ఒకేసారి 26 ఫోన్లను కనెక్ట్‌ చేసే సౌకర్యం ఉంది. అలా అంతమంది పంటర్ల (పందెం కాసేవాళ్లు) ఫోన్లు రిసీవ్‌ చేసుకుంటూ బెట్టింగ్‌ నిర్వహించవచ్చు. హవాలా రూపంలో కీలక లావాదేవీలు.. 

► ఈ బోర్డ్‌ నిర్వహణ కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్‌ త్రినాథ్, నూజివీడు వాసి ఎన్‌.భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన జె.ప్రసాద్‌లను ఆపరేటర్లుగా నియమించుకున్నారు. బెట్టింగ్‌ బాక్స్‌ ద్వారా వచ్చే కాల్స్‌ ఆధారంగా ఈ ముగ్గురూ పంటర్లు కోరిన విధంగా యాప్‌లో బెట్టింగ్‌ కాస్తారు. దీని నిష్పత్తి నిమిష నిమిషానికీ మారిపోతూ ఉంటుంది. ఓడిన వారు నిష్క్రమిస్తుండగా... కొత్త వారు చేరుతూ ఉంటారు. లాభనష్టాలు పంటర్లకు యాప్‌లో కనిపిస్తూ ఉంటాయి.

►  ఈ దందాలో లావాదేవీలు మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.  సోమన్నకు చేరాల్సిన మొత్తం మాత్రం హవాలా ద్వారా పంపిస్తున్నారు. పీఎస్‌ఎల్‌ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్‌ సాగుతోందని సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ నేతృత్వంలోని బృందం నిజాంపేటలోని ఫ్లాట్‌పై దాడి చేసింది. సోమన్న మినహా మిగిలిన వారిని అరెస్టు చేసి నగదు, ఉపకరణాలు స్వాధీనం చేసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించింది.
 చదవండి: స్మగ్లింగ్‌ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement