శృంగవరపుకోట: పిల్లలు కలగని దంపతులు, నిరుద్యోగులను టార్గెట్ చేసి మంత్రించిన యంత్రాల పేరుతో మోసగిస్తున్న ముగ్గురు దొంగస్వాములను ఎస్.కోట మండలం, ముషిడిపల్లి గిరిజన గ్రామంలో బుధవారం నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి దొంగస్వాములను పట్టుకున్న ముషిడిపల్లి గ్రామపెద్ద ముత్యాల సన్యాసిరావు, స్వాముల చేతిలో మోసపోయిన చీడిపాలెం గిరిజనులు చిమిడి జోగారావు, గడుబంటి రామకృష్ణ, జి.గంగరాజు, అప్పారావు, బి.గంగమ్మ, పొటుపర్తి జగన్నాథం తదితరులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఎస్.దుర్గారావు, విశాఖ జిల్లా వాడపల్లికి చెందిన సతీష్, కె.దుర్గారావు అనే ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు.స్వామిజీ శిష్యులమని చెప్పి గ్రామంలోని పలువురి నుంచి గిరిజన కుటుంబాల వివరాలు సేకరించారు. ఆ తర్వాత గిరిజనుల ఇళ్లకు వెళ్లి మీకు ఏళ్ల తరబడి పిల్లలు లేరని కొందరికి, మీకు ఉద్యోగాలు రాక బాధపడుతున్నారంటూ మరి కొందరికి చెప్పి కలిశారు. మీరు పడుతున్న సమస్యలను దుర్గారావు స్వామీజీ తీరుస్తారని చెప్పి రంగప్రవేశం చేయించారు. దొంగస్వామీజీ వచ్చి రూ.6వేలు చెల్లిస్తే మంత్రించిన యంత్రం, పూజ చేసిన సామగ్రి ఇస్తానని, వాటిని భద్రంగా దాచుకుంటే సమస్యలు తీరడంతో పాటు కోరికలు నెరవేరుతాయని నమ్మించి 9మంది నుంచి రూ.53వేలు వసూలు చేశాడు. మంత్రించిన యంత్రాలు, పూజాసామగ్రి గురించి ఎవరికీ చెప్పకూడదని, వాటిని తెరిచి చూస్తే పేలిపోతాయని స్వామిజీ బెదిరించాడు.
నమ్మినట్లు ప్రవర్తించిన గ్రామపెద్ద
దొంగ స్వామీజీ, ఇద్దరు శిష్యులు బుధవారం ఉదయం ముషిడిపల్లి గ్రామంలో ప్రవేశించి మాజీ సర్పంచ్ ముత్యాల సన్యాసమ్మ కుమారుడు ముత్యాల సన్యాసిరావును కలిసి మా వద్ద మంత్రించిన యంత్రాలను తీసుకుంటే కోరికలు వెంటనే తీరుతాయని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సన్యాసిరావు నమ్మినట్లు ప్రవర్తించి ముగ్గురు స్వాములను గ్రామంలోని రామాలయంలోకి తీసుకువెళ్లి లోపల ఉంచి బయట తాళం వేసి ఎస్.కోట పోలీసులకు సమాచారమందించాడు. ఈ విషయం తెలిసిన తరువాత స్థానికంగా మోసపోయిన చీడిపాలెం బాధితులు, గ్రామస్తులు పెద్దఎత్తున రామాలయం వద్దకు చేరుకున్నారు. బ్రాహ్మణ వేషధారణలో తిరుగుతూ అమాయకులను మోసగిస్తున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలయ పురోహితుడు దొంతుకుర్తి సాయికుమార్ శర్మ వారిని ప్రశ్నించగా ఒకసారి బ్రాహ్మణులమని, మరోసారి విశ్వబ్రాహ్మణులమని పొంతనలేని సమాధానాలిచ్చారు. పోలీసు సిబ్బంది రామాలయం వద్దకు చేరుకుని ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment