ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుండగులు
గంగావతి: ఇద్దరు దోపిడీ దొంగలు తప్పించుకుని పారిపోతుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ తుపాకీతో కాల్చడంతో గాయపడిన ఘటన శుక్రవారం తాలూకాలోని ముస్టూరు గ్రామ సమీపంలో జరిగింది. కొప్పళ జిల్లా ఎస్పీ అరుణ్‌గిరి కథనం మేరకు ఈనెల 16న బెంగళూరులో ఓ పందుల ఫారంలో ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడగా, ఫారం యజమాని రామకృష్ణ వారికి అడ్డుపడ్డారు. ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఉడాయించారు.
దుండగులు గంగావతి తాలూకాలో సంచరిస్తున్నట్లు తెలియడంతో చిక్కజాల ఎస్‌ఐ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీసు బృందం గంగావతికి చేరుకుంది. దుండగులు ప్రైవేట్ వాహనంలో వెళ్తుండగా వెంబడించి ముస్టూరు సమీపంలో అటకాయించారు. అయితే దుండగులు పోలీసులపై తిరగబడి పరారవ్వడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ బసవరాజ్ వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. శంకర్ సింధనూరు, అశోక్ బెళహట్టిల కాళ్లకు తూటాలు తగిలి తీవ్రంగా గాయపడగా గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆస్పత్రి వద్ద డీఎస్పీ రుద్రేశ్ ఉజ్జినకొప్ప గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment