గంగాదేవి (ఫైల్)
యాడికి(అనంతపురం జిల్లా): గత ఏడాది శ్మశానంలో పాతిపెట్టిన మృతదేహం కోసం రెవెన్యూ, పోలీసు అధికారులు అన్వేషణ చేపట్టారు. వివరాలు... యాడికి మండలం తూట్రాళ్లపల్లికి చెందిన లింగాల మల్లన్న, ఓబులమ్మ దంపతుల కుమారుడు గుర్రప్పకు యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన సుంకులమ్మ రెండో కుమార్తె గంగాదేవితో 2009లో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్రప్ప.. తన కుటుంబంతో కలిసి తాడిపత్రిలో నివాసముండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 15న ఉదయం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది.
చదవండి: విషాదం: అన్నయ్యల ఆశీర్వాదం తీసుకోకుండానే..
అనంతరం గుర్రప్ప విధులకు వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం గుర్రప్పకు గంగాదేవి ఫోన్ చేసి తాను విషపూరిత ద్రావకం తాగినట్లు తెలిపింది. దీంతో హడావుడిగా ఇంటికి చేరుకున్న గుర్రప్ప వెంటనే బంధువుల సాయంతో భార్యను తాడిప్రతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అదే రోజు రాత్రి అనంతపురానికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. దీంతో గంగాదేవి మృతదేహాన్ని తూట్రాళ్లపల్లికి తీసుకెళ్లి, ఇరువైపులా కుటుంబసభ్యుల సమక్షంలో ఖననం చేశారు.
ఐదు నెలల క్రితం మరో మహిళతో గుర్రప్పకు వివాహమైంది. ఆ సమయంలో తన కుమార్తె గంగాదేవికి ఇచ్చిన కట్నకానుకల విషయంగా గుర్రప్పను సుంకులమ్మ నిలదీసింది. అనంతరం తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రెవెన్యూ, పోలీసు అధికారులను ఆమె ఆశ్రయించింది. దీంతో గురువారం ఉదయం యాడికి తహసీల్దార్ అలెగ్జాండర్, అనంతపురం వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శంకర్, వైద్యులు భార్గవ్‌రాజు, సాయి రవితేజ, తాడిపత్రి పోలీసులు తూట్రాళ్లపల్లి శ్మశానికి చేరుకుని గంగాదేవిని ఖననం చేసిన ప్రాంతంలో తవ్వి చూశారు. మృతదేహం ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం వరకూ అన్వేషించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహం వెలికి తీత కార్యక్రమాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment