
బెంగళూరు: కొత్త జీవితం ఆరంభించాలని ఎన్నో కలలుగన్న ఓ జంట అర్ధాంతరంగా తనువు చాలించింది. వివాహ బంధంతో ఒక్కటికానున్న వధూవరులు.. ఆ వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను బంధించే క్రమంలో మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లో జరిగిన ప్రమాదం వారిని బలితీసుకున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు... క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28), శశికళ(20) దూరపు బంధువులు. గతేడాది నవంబరు 22న ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది.
ఈ క్రమంలో ఈ ఏడాది అదే రోజున వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని చంద్రు, శశికళ ముచ్చటపడ్డారు. ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించిన ఈ జంట సోమవారం ఉదయం ముదుకుతూర్‌లో కావేరీ నదీ తీరాన జలధామ రిసార్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మోటార్‌బోటు ఎక్కిన కాబోయే వధూవరులు, ఇంగ్లీష్ సినిమా ‘టైటానిక్’ లోని ప్రణయ దృశ్యాలను తలపించేలా ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయారు. చంద్రు, శశికళను కాపాడేందుకు ఫొటోగ్రాఫర్ చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో ఇద్దరూ జలసమాధి అయ్యారు. (చదవండి: పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే! )
ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఫొటోషూట్ కోసం వెళ్లిన సమయంలో శశికళ హైహీల్స్ ధరించి ఉన్నారని, ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో అదుపు తప్పడంతో బోటు పక్కకు వంగిందని పేర్కొన్నారు. ఆ వెనువెంటనే ఆమెతో పాటు చంద్రు సైతం నీళ్లల్లో పడిపోయాడని, బోటు నడిపే వ్యక్తి, ఫొటోగ్రాఫర్‌కు ఈత రావడంతో బతికి బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనపై రిసార్టు యజమానికి సమన్లు జారీ చేశామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఫొటోగ్రాఫర్ తమకు సమాచారం అందించగానే ఘటనాస్థలికి చేరుకున్నామని, చంద్రు, శశికళ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. (200 ఫోన్లకు నగ్న చిత్రాలను పంపి...)
Comments
Please login to add a commentAdd a comment