
సాక్షి, కుల్కచర్ల: పబ్‌జీ గేమ్ కారణంగా ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెలికచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఉప్పరి అనంతయ్య దంపతులు కుల్కచర్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు ఓంకార్ (15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నాయి.
దీంతో అనంతయ్య అప్పు చేసి మరీ మూడు నెలల క్రితం కొడుకు కోసం సెల్‌ఫోన్ కొన్నాడు. బాలుడు నిత్యం ఆన్‌లైన్ తరగతుల పేరుతో పబ్‌జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన అనంతయ్య గురువారం కుమారుడిని మందలించాడు. ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటున్నావని.. కేవలం ఆన్‌లైన్ క్లాసులున్నప్పుడే వినాలని చెప్పాడు. ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్యం పాడవుతుందన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఓంకార్ ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment