సాక్షి, విశాఖపట్నం: ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. పసిపిల్లల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. కోర్టు అనుమతితో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో రెండు బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. పేషెంట్ల వివరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు అన్నీ పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాము. డాక్టర్ నమ్రతని విచారిస్తే పసిపిల్లల అక్రమ రవాణా రాకెట్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయి' అని రాజీవ్ కుమార్ మీనా తెలిపారు.
చిన్నారుల అక్రమ రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా అరెస్టయి విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న డాక్టర్ నమ్రతా అస్వస్థత పేరుతో బుధవారం హైడ్రామాను కొనసాగించారు. తనకి అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా సృష్టించారు. దీంతో ఆమెని జైలు సిబ్బంధి కేజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కేజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో కూడా నమ్రత హడావిడి చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కర్ణాటక దావణగిరిలో అదుపులోకి తీసుకునే సమయంలోనూ తనకు కరోనా ఉందంటూ పోలీసులని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. తాజాగా అనారోగ్యం పేరుతో మరో డ్రామాకు తెరలేపింది. కాగా.. హైకోర్టులో డాక్డర్ నమ్రత ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ కావడంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. (డాక్టర్ పచ్చిపాల నమ్రత అరెస్ట్)
మరోవైపు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సెర్చ్ వారెంట్‌తో మధ్యాహ్నం నుంచి సృష్టి ఆస్పత్రి అణువణువునా తనిఖీ చేస్తున్నారు. మహారాణి పేట పీస్ సీఐ సోమశేఖర్, టూటౌన్ సీఐ వెంకట్రావుల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. సరోగసి కోసం వచ్చిన పేషేంట్ల వివరాలతో పాటు ఒక్కొక్క డెలివరీ కేసు వివరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో ఈ ఆస్పత్రి నుంచి 56 శిశు జననాలపై జీవీఎంసీ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. కేజీహెచ్‌కి చెందిన ఇద్దరు వైద్య నిపుణులు తనిఖీలలో పోలీసులకు సహకరిస్తున్నారు. తనిఖీలు అనంతరం కోర్డు అనుమతితో ఆసుపత్రి సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. (నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు)
Comments
Please login to add a commentAdd a comment