
ఓడీ చెరువు: మరో ఐదు రోజుల్లో తన చిన్న కుమార్తె యశస్విని వివాహం జరగనుంది. ఇల్లంతా హడావుడిగా ఉంది. నగలు, పట్టువస్త్రాలు అన్నీ సిద్ధం చేశాడు. పెళ్లి సామగ్రి కొనాలి. బంధువులను పిలవాలి. స్నేహితులు, తెలిసిన వారికి పెళ్లిపత్రికలు పంచి, ఇంటికి వెళ్తున్నాడు. అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది.
ఇంటిపెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. ఓడీ చెరువు మండలం నల్లగుట్లపల్లికి చెందిన కొట్టాల పద్మనాభరెడ్డి (55) పెళ్లి పత్రికలు పంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. కదిరి – హిందూపురం రహదారిపై నల్లగుట్లపల్లి రోడ్డు మలుపువద్ద వెనుకవైపు నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొనింది. సుమారు పది మీటర్ల మేర స్కూటీతో పాటు వాహనదారుడిని తోచుకెళ్లింది. ఈ ప్రమాదంలో పద్మనాభరెడ్డి తలకు బలమైన గాయం అయ్యింది.
తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రమాదానికి కారణమైన కారులో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పత్రికలు పంచి ఇంటికి వస్తావనుకుంటే అంతలోనే కానరానిలోకానికి వెళ్లితివా.. నాన్నా అంటూ కుమార్తె యశస్విని రోదిస్తోంది..భార్య, బంధువుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడిపెట్టించాయి.
(చదవండి: తమదే అనుకుని వేరే బైకులో రూ. 2.80 లక్షలు ఉంచి.. చివరకు..)
Comments
Please login to add a commentAdd a comment