
సాక్షి, కర్నూలు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-వైఎస్సార్ కడప జాతీయ రహదారిపై ఓ డీసీఎం లారీ తీవ్ర బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు చిన్నారులు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిచండం కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి వెళ్తున్న క్రమంలో వారిపైకి ఒక్కసారిగి లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా స్థానిక ఎర్రగుంట్ల గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. మృతి చెందిన చిన్నారులు సుజాత, హర్షవర్థన్, ఝాన్సీ, వంశీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో రహదారిపైన 40 మంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోతుండగా స్థానికులు చేజ్ చేసి మరి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment