మహాదేవి(ఫైల్ ఫొటో)
ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. ఇటీవల పెళ్లి కూడా నిశ్చయమైంది. త్వరలోనే ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగు పెట్టాలని కలలుగంది. అంతలోనే కల చెదిరిపోయింది. రోడ్డు ప్రమాదం ఆ యువతిని పొట్టన పెట్టుకుంది. నగర శివారులోని పంచలింగాల వద్ద స్కూటీని ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ దుర్మరణం చెందింది.
సాక్షి, కర్నూలు(టౌన్)/ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మల్లేష్, కొండమ్మకు నలుగురు కూతుళ్లు. కొడుకులు లేకపోయినా బేల్దారి పనులు చేసుకుంటూ చదివించారు. కూతుళ్లు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాగా చదువుకున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. రెండో కూతురు ఇందిర టీటీసీ చదువుతోంది. మూడో కూతురు మహాదేవి(24) ఏఆర్ కానిస్టేబుల్‌గా కర్నూలులో ఉద్యోగం చేస్తోంది. చివరి అమ్మాయి నీలమ్మ డిగ్రీ చదువుతోంది. కాగా రెండేళ్ల క్రితం ఉద్యోగం సాధించిన మహాదేవికి ఇటీవల ఎమ్మిగనూరుకే చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఈ క్రమంలో కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని మంగళవారం ఉదయం పంచలింగాల వద్ద ఉన్న రామాలయంలో పూజలు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరింది.
పోలీసు లాంఛనాలతో మహాదేవి అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం
ఆలయ సమీపానికి చేరుకోగానే ఆమె స్కూటీని వెనుక నుంచి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఐచర్ వాహనం బలంగా ఢీకొంది. ప్రమాదంలో శరీర భాగాలు నుజ్జునుజ్జు అయి దుర్మరణం చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఎమ్మిగనూరుకు తరలించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు సంక్షేమ నిధి నుంచి మృతురాలి కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (తల్లి ఆత్మహత్య, తండ్రి హత్య.. తాత జైలుపాలు!)
Comments
Please login to add a commentAdd a comment