నిలిపి ఉన్న వాహనాలను ఢీకొని రోడ్డు ప్రమాదాలు
ఈ తరహాలో ప్రతిరోజూ ఓ ప్రమాదం
ప్రతి మూడు రోజులకూ ఒకరు మృత్యువాత
హైవేలపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు: రోడ్డు భద్రత అడిషనల్ డీజీ మహేష్ భగవత్
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్లక్ష్యం మరికొందరిపాలిట మృత్యుపాశమవుతోంది. అనుమతి లేకున్నా జాతీయ రహదారుల వెంట నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు ఢీకొని దుర్మరణంపాలవుతున్నారు. జాతీయ రహదారుల్లో వేగంగా దూసుకెళ్లే వాహనదారులు ముందు ఆగిన లారీలు, భారీ ట్రక్కులను గుర్తించే లోపే నష్టం జరిగిపోతోంది.
ఏప్రిల్ 25న కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు మొత్తం కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ప్రమాదాలు పెరుగుతుండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
రోజుకో రోడ్డు ప్రమాదం.. మూడు రోజులకొకరు మృతి
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ తరహాలో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను ఢీకొట్టడం కారణంగా ప్రతి రోజూ కనీసం ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల కారణంగా ప్రతి మూడు రోజులకు ఒకరి చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2018 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 600 మంది మృతి చెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 2022లో తెలంగాణలో మొత్తం 331 రోడ్డు ప్రమాదాలు ఈ తరహాలో జరగ్గా, 128 మంది మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల మధ్య జరగడం గమనార్హం. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆగిఉన్న లారీలను ఢీకొట్టే కార్లు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హైవేలపై పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు
జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు నిలిపి ఉంచడం, పార్కింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం. అలా వాహనాలు నిలిపితే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జాతీయ రహదారుల వెంట ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఈ తరహాలో వాహనాలు నిలపకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ఆ వేళల్లో పోలీసులను మరింత అప్రమత్తం చేసేలా సర్క్యులర్‌ను జారీ చేస్తాం. – మహేష్ భగవత్, తెలంగాణ రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ
ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన నిర్లక్ష్యం ఇలా..
» జాతీయ రహదారుల వెంట వాహనాలు నిలిపి ఉంచవద్దని నిబంధనలు ఉన్నా.. భారీ ట్రక్కులు, లారీల డ్రైవర్లు కొందరు వీటిని విస్మరిస్తున్నారు.
» ఏదైనా మరమ్మతుల కారణంగా వాహనం తప్పక ఆపాల్సి వస్తే వెనుక నుంచి వాహనదారుడికి ఆ విషయం తెలిసేలా పార్కింగ్ లైట్లు తప్పక ఆన్ చేసి పెట్టాలి. సేఫ్టీ ట్రైయాంగిల్ ఆకారాన్ని వాహనానికి కొంత దూరంలో పెట్టాలి.
» జాతీయ రహదారుల వెంట ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలిపి ఉంచాలి. కానీ చాలామంది అలా చేయడం లేదు
» డ్రైవర్ అలసిపోయినప్పుడు తెల్లవారుజాము సమయంలో వాహనాన్ని జాతీయ రహదారి వెంటే నిలిపి ఉంచి నిద్రిస్తుండడం సైతం మిగిలిన వాహనదారులకు మృత్యుపాశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment