అచ్చెన్నాయుడి సోదరుడు, అనుచరులపై రౌడీషీట్‌ | Rowdysheet on Atchannaidu Brother and followers | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడి సోదరుడు, అనుచరులపై రౌడీషీట్‌

Published Wed, Jun 23 2021 4:54 AM | Last Updated on Wed, Jun 23 2021 4:54 AM

Rowdysheet on Atchannaidu Brother and followers - Sakshi

కింజరాపు హరివరప్రసాద్, సురేష్‌

టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ప్రసాద్‌ కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కింజరాపు కృష్ణమూర్తిపై రౌడీషీట్‌ నమోదు చేసినట్లు టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌లు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులను పలు కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించి బైండోవర్‌ చేసినప్పటికీ.. ఆయా బైండోవర్‌ కేసులను సైతం ఉల్లంఘించడంతో రౌడీషీట్‌ తెరిచినట్లు పేర్కొన్నారు. రౌడీషీట్‌ తెరిచేందుకు పలు ఘటనల్లో నమోదు చేసిన కేసుల వివరాలు తెలియజేశారు.

► 2008లో నిమ్మాడలో కింజరాపు గణేష్‌ ఆధ్వర్యంలో  పింఛన్ల పంపిణీ చేస్తుండగా, అప్పటి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్, అనుచరులు కింజరాపు కృష్ణమూరి తదితరులు గణేష్, అతని కుమార్తెపై దాడికి పాల్పడ్డారు. దీనిపై గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 354, 323, 506 సెక్షన్లు, ఐపీసీ 34 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
► 2010లో నిమ్మాడకు చెందిన మెండ పోతయ్య ఉపాధి పనికి వెళ్తుండగా కింజరాపు హరివరప్రసాద్, మెండ బాబురావు తదితరులు పోతయ్యపై దాడికి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు 341, 323, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. 
► 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడకు చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్‌ వేశారు. దీంతో కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బమ్మిడి లక్ష్మిపై బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ తరఫున కింజరాపు అప్పన్న అప్పట్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన దువ్వాడ శ్రీనివాస్‌ సాయంతో నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా వారిపై హత్యాప్రయత్నం చేశారు. హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించిన కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్‌లపై 307, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
► మొత్తం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బైండోవర్‌ కేసులను సైతం ఉల్లంఘించడమే కాకుండా భవిష్యత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారిపై రౌడీషీట్‌ నమోదు చేసినట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement