గ్యాస్ గీజర్ నుంచి కార్బన్
మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం
బాత్రూమ్స్‌లో వెంటిలేషన్ లేకపోవడం వల్లే..
గ్యాస్ గీజర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ జెక్ కాలనీలో బాత్రూంలో ముగ్గురు కుటుంబసభ్యులు మృత్యువాత పడిన ఘటనలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు గ్యాస్ ఆధారిత గీజర్ వాడుతుండేవారని, అదే వారి పాలిట మరణశాసనమైందని తెలుస్తోంది. దీని నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు కారణంగానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని డాక్టర్లు నిర్ధారణకు వచ్చా రు. ఈ వాయువును పీలి్చన ఐదు నిమిషాలకే స్పృహ తప్పిపడిపోవడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు. గీజర్ నుంచి ఇలాంటి విషపూరితమైన వాయువులు ఎలా వెలువడుతాయో తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
వెంటిలేషన్ లేకపోవడం వల్లే..
సాధారణంగా స్నానాల గదుల్లో గాలి, వెలుతురు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గ్యాస్ ఆధారంగా పనిచేసే గీజర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కిచెన్లలో కూడా గీజర్లను బిగిస్తుంటారు. బాత్రూమ్‌లో కానీ, కిచెన్‌లో కానీ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వెంటిలేటర్లు బిగించినప్పుడు ఎప్పుడూ తెరిచి ఉండేలా చూసుకోవాలి. గీజర్ ఆన్ చేసుకున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచుకోవాలి. గీజర్‌ను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీక్ ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే రిపేర్ చేయించాలి.
రోజంతా గీజర్ ఆన్ ఉండొద్దు..
గీజర్‌ను ఎట్టిపరిస్థితుల్లో కూడా రోజంతా ఆన్ చేసి ఉంచకూడదు. ఆన్‌చేసి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవసరం ఉండి నిత్యం వాడాల్సి వస్తే మాత్రం మధ్యలో కాసే పు ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేసుకోవాలి. బాత్రూమ్‌లోకి వెళ్లే ముందు గీజర్‌ను ఆఫ్ చేసుకుంటే మంచిది. అప్పుడు ప్రమాదాలు జరిగే చాన్స్ తక్కువగా ఉంటుంది.
కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం
గ్యాస్ గీజర్ లోపల కాలినట్లయితే..అందులో నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్యాస్ రంగు, వాసన ఉండదు. దీంతో అది విడుదలైనట్టు కూడా గుర్తుపట్టడం కష్టం. అది పీల్చుకున్న వారి మెదడుపై నేరుగా చాలా తక్కువ సమయంలోనే ప్రభావం చూపుతుంది. దీంతో ఐదు నిమిషాల్లోనే స్పృహ తప్పిపోతుంటారు. ఎక్కువగా కనుక పీల్చుకుంటే ప్రాణాలకే ప్రమాదం. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment