మానస(ఫైల్)
సాక్షి, సనత్‌నగర్: నవవధువు హత్యకు గురైంది.. కట్టుకున్న భర్తే కాలయముడై కడతేర్చాడు.. తరచూ భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలకు తోడు భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య గొంతు నులిమి హత్య చేశాడు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ దర్పల్లికి చెందిన మానస(24)కు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్(34)తో గతేడాది నవంబర్ 20న వివాహం జరిగింది. 3నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పలుమార్లు ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మానస, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గంగాధర్‌పై 498 సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆ దంపతులు కలిసి జీవించేందుకు సమ్మతించారు. అయినా గొడవలు కొనసాగుతుండటంతో మానస పుట్టింటికి వెళ్లిపోయింది. గంగాధర్ ఒక్కడే మూసాపేట జయప్రకాష్‌పగర్‌లో గదిని అద్దెకు తీసుకుని రియల్ ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
చదవండి: సైబర్ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్
మరింత ఆవేశానికి లోనై..
ఇదిలా ఉండగా, 10 రోజుల క్రితం గంగాధర్ తండ్రి హనుమంతు చనిపోయాడు. విషయం తెలుసుకున్న మానస జగద్గిరిగుట్టలోని అత్తింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే భార్యను గంగాధర్ మూసాపేటలోని తాను ఉండే ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే మానస గర్భవతి అయ్యిందని ఆమె తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని భార్యను ఆదివారం రాత్రి నిలదీశాడు. తనకు ప్రెగెన్నీ వచ్చిందని, తీయించేసుకున్నానని చెప్పడంతో మరింత ఆవేశానికి లోనైన గంగాధర్ గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని విషయాన్ని అతడి సోదరుడికి తెలియజేసి పరారయ్యాడు. మానస కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్‌ను పట్టుకునేందుకు టీమ్‌లు రంగంలోకి దిగాయని ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు.
చదవండి: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..
Comments
Please login to add a commentAdd a comment