వెండి సింహాల చోరుడి అరెస్ట్ | Silver lions thief arrested in AP | Sakshi
Sakshi News home page

వెండి సింహాల చోరుడి అరెస్ట్

Published Sun, Jan 24 2021 5:24 AM | Last Updated on Sun, Jan 24 2021 5:24 AM

Silver lions thief arrested in AP - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, చిత్రంలో స్వాదీనం చేసుకున్న వస్తువులు

సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉండే మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన నిందితుడు జక్కంపూడి సాయిబాబా అలియాస్‌ జక్కంశెట్టి సాయిబాబాను అరెస్ట్‌ చేసినట్టు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన నిందితుడితోపాటు వెండి ప్రతిమలను కొనుగోలు చేసిన వ్యాపారిని  అరెస్ట్‌ చేసి వారి నుంచి వెండి సింహాలకు సంబంధించి 9 కిలోల వెండి దిమ్మెలతోపాటు ఇతర ఆలయాల్లో చోరీ చేసిన మరో 6.4 కిలోల వెండి దిమ్మెలను స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. సీపీ శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 

జూలైలోనే చోరీ.. 
జక్కంపూడి సాయిబాబా 2008 నుంచి ఆలయాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. పగటి వేళ తాపీ, వ్యవసాయ పనులు చేస్తూ.. రాత్రివేళ ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనాలు చేసేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో పనుల్లేకపోవడంతో సాయిబాబా 2020 జూన్‌లో విజయవాడ వచ్చాడు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగుతుండగా 7 అంతస్తుల భవనం కొండ పక్కన రేకుల షెడ్డులో నీలం రంగు పరదాతో కప్పి ఒక పక్కకు జారి ఉన్న వెండి రథం కనిపించింది. అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి రథానికి నాలుగు వైపులా వెండి సింహాల ప్రతిమలను చోరీ చేయాలని నిర్ణయించుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తర్వాత భీమవరంలో పాత ఇనుప సామగ్రి దుకాణం నుంచి రెండు ఇనుప రాడ్లను కొనుగోలు చేసి వాటితో ఆటోలో గుడివాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి విజయవాడ బస్టాండ్‌కు.. అక్కడి నుంచి దుర్గగుడి వద్దకు చేరుకున్నాడు.

చిత్తు కాగితాలు ఏరుకునే వాడిలా తనతో తెచ్చుకున్న సంచితో కొండ ప్రాంతంలో తిరుగుతూ.. రాత్రి 8.30 గంటలకు రథం ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న రాడ్లతో మూడు సింహాలను పెకలించాడు. నాలుగో సింహాన్ని తొలగించే ప్రయత్నం చేయగా అది రథం నుంచి వేరు కాలేదు. మూడు సింహాల ప్రతిమలను తీసుకుని తణుకు నగర శివారులో గల కాలువ గట్టు చేరుకున్నాడు. వాటిని పగులగొట్టి తణుకులోని సురేంద్ర జ్యువెలరీ యజమాని ముత్త కమలే‹Ùకు రూ.35 వేలకు విక్రయించాడు. కేసును ఛేదించిన విజయవాడ వెస్ట్‌ జోన్‌ ఏసీపీ కె.హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావులకు రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో సిట్‌ డీఐజీ అశోక్‌కుమార్, డీసీపీ–2 విక్రాంత్‌పాటిల్‌ పాల్గొన్నారు. 

ఇలా పట్టుబడ్డాడు.. 
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ చోరీ ఆలయంలో పనిచేసే సిబ్బంది చేశారా, ఆలయ అభివృద్ధి పనులు చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు చేశారా లేక పాత నేరస్తుల పనా అనే కోణాల్లో దర్యాప్తు జరిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలయాల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్తుల కాల్‌ డేటాను కూడా పరిశీలించగా.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన సాయిబాబా ఈ నేరాన్ని చేసినట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నేరాన్ని తానే చేసినట్టు అంగీకరించిన సాయిబాబా.. దొంగలించిన వెండి ప్రతిమలను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ముత్త కమలేష్‌ అనే బంగారం వ్యాపారికి విక్రయించినట్టు చెప్పాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement