A Software Engineer Was Burnt Alive By TDP Sarpanch - Sakshi
Sakshi News home page

టీడీపీ సర్పంచ్‌ చేతిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సజీవ దహనం

Published Mon, Apr 3 2023 5:46 AM | Last Updated on Mon, Apr 3 2023 11:08 AM

A software engineer was burnt alive by TDP Sarpanch - Sakshi

టీడీపీ నేత సోమిరెడ్డితో చాణక్య ప్రతాప్‌ సోదరుడు రుపంజయ

చంద్రగిరి (తిరుపతి జిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. ఇటీవల కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ మూకల దాడులను మరిచిపోకముందే మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. అన్నెంపున్నెం ఎరుగని ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై పెట్రోల్‌ పోసి అతడి కారుతో సహా సజీవ దహనం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితులు చాణక్య ప్రతాప్, రుపంజయ తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సొంత అల్లుడు సంజీవ్‌కు స్వయానా బాబాయి కుమారులే కావడం గమనార్హం. అంతేకాకుండా టీడీపీ సీనియర్‌ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పరిటాల శ్రీరామ్‌లతోనూ నిందితులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ చౌదరితోనూ పరిచయాలు ఉన్నాయి. రాజీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పిలిపించి అతడిని టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడు చాణక్య ప్రతాప్‌ సజీవ దహనం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి కలకలం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య, చెంచెమ్మ దంపతులకు నాగరాజు, పురుషోత్తం కుమారులు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి టీడీపీ సర్పంచ్‌ చాణక్య ప్రతాప్‌ తమ్ముడు రుపంజయ భార్యతో పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రుపంజయ ఎలాగైనా పురుషోత్తంను మట్టుపెట్టాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన తమ్ముడు పురుషోత్తంను బెంగళూరుకు పంపించేశాడు. 

హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నం
టీడీపీ సర్పంచ్‌ చాణక్య ప్రతాప్, అతడి తమ్ముడు రుపంజయ.. నాగరాజు కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాగరాజు తన పొలం వద్ద ఏర్పాటు చేసిన పైపులను పగలకొట్టడం, చెట్లు నరికివేయడం, మోటార్లను కాల్చివేయడం వంటివి చేసి టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తంను హతమా­ర్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని తిరుపతి అవిలాలలో నివాసం ఉంటూ వర్క్‌ఫ్రమ్‌ హోం చేసుకుంటున్న నాగరాజును గోపి అనే వ్యక్తితో పిలిపించారు. దీంతో శనివారం సాయంత్రం నాగరాజు తన కారులో స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లాడు. అక్కడ టీడీపీ సర్పంచ్‌ చాణక్య ప్రతాప్, రుపంజయ, వారి అనుచరులు గోపి, సుబ్బయ్యతోపాటు మరికొంతమంది నాగరాజుతో మాట్లాడారు.

ఆ తర్వాత శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో గంగుడుపల్లి సమీపంలోని కురవకణం మలుపు వద్దకు తీసుకెళ్లి నాగరాజు కారులోనే అతడిని పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశారు. ఈ ఉదంతం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటరావు, వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప, సీఐ ఓబులేసు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతుడి భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణక్య ప్రతాప్, రుపంజయ, గోపి, సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు రుపంజయను పోలీసులు అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

ఇద్దరు టీడీపీ నేతల హస్తం!
కాగా నాగరాజు హత్యలో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో ఒకరు మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. హత్యకు పాల్పడిన చాణక్య ప్రతాప్‌ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ ఇద్దరు నేతలు హత్యకు సంపూర్ణ సహకారం అందించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement