సందీప్ కుమార్(ఫైల్)
సాక్షి, రాయపర్తి: ఒకే అమ్మాయి. మూడు పేర్లతో వ్యవహరించింది. మూడు వేర్వేరు ఫోన్ నంబర్లు వాడింది. ఓ యువకుడికి ప్రేమ వల విసిరింది. రకరకాల కథలు చెప్పింది. వేధింపులకు గురి చేసింది. బెదిరింపులకు కూడా దిగింది. చివరకు అతని ఆత్మహత్యకు కారణమయ్యింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మెరిపిరాలకు చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ కుమారుడు మైలపాక సందీప్‌కుమార్ (23) మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.
తన సోదరితో కలిసి చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన స్రవంతి ఫోన్‌లో పరిచయమైంది. ఇద్దరు రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే ఆమే మరో ఇద్దరు యువతుల్లాగా (కావ్య, మనీషా పేర్లతో) వేరే నంబర్లతో ఫోన్ చేయడం ప్రారంభించింది. ముగ్గురు అమ్మాయిల మాదిరి వ్యవహరిస్తూ నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని చెప్పొకొచ్చింది. కేవలం ఫోన్‌లో మాట్లాడటం తప్ప వారిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసుకోలేదు. ఇలా మాట్లాడే క్రమంలో సందీప్.. తాను మొదట పరిచయమైన స్రవంతినే ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. ఈ క్రమంలో స్రవంతికి పెళ్లి అయ్యింది.
కానీ ఆమె మిగతా ఇద్దరిలాగా ఫోన్‌లో సందీప్‌తో మాట్లాడుతూనే ఉంది. మనీషా పేరుతో ఫోన్ చేస్తే.. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా.. నన్ను పెళ్లి చేసుకో అనేది. కావ్య పేరుతో ఫోన్ చేసినప్పుడు కూడా అలాగే అనేది. అయితే సందీప్ తాను ఒకే అమ్మాయిని ప్రేమించానని, ఆమె పెళ్లయిపోయింది కాబట్టి ఇక ఎవరినీ ప్రేమించలేనని చెప్పేవాడు. ఆరు నెలలు ఇలానే గడిచాయి. తర్వాత స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని, కాబట్టి తమను ప్రేమించకపోయినా పర్వాలేదుకానీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మిగతా ఇద్దరు పేర్లతో ఫోన్ చేసి వేధించడం ప్రారంభించింది.
అయితే సందీప్.. తాను గతంలో ప్రేమించానని, తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఆమెను ఎలా చేసుకుంటానని చెప్పేవాడు. అయినా నీ కోసమే భర్తను వదిలేసి వచ్చిందని, పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని ఆ రెండు పేర్లతో ఫోన్‌లో మాట్లాడుతూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ ఈనెల 12న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment