సాక్షి, సిటీబ్యూరో:
బండ్లగూడ జాగీర్ సన్‌సిటీలో నివసించే భార్యభర్తలు ఇందిర, ఆనంద్ తమ కుమారుడు విక్కీని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణానికి కారణం ఆనంద్ ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి అప్పుల పాలు కావడం.
పంచాయితీ రాజ్ శాఖలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కీసర విభాగంలో ఏఈగా పని చేస్తున్న గడ్డం రాహుల్ బాబు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఆ నష్టాలు పూడ్చుకోవడానికి మోసగాడిగా మారి జైలుకెళ్లాడు.
దుండిగల్‌లోని ఏరోనాటికల్ కాలేజీలో బీటెక్ చదువుతున్న గుడిమల్కాపూర్‌కు చెందిన శీలం మనోజ్ ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడి, ఆరి్థకంగా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
తన భర్త జానారెడ్డి ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడి డబ్బు పోగొట్టుకోవడంతో ఆరి్థక సమస్యలు చుట్టుముట్టి మన్సూరాబాద్ భవానీనగర్‌కు చెందిన వివాహిత శిరీష ఆత్మహత్య చేసుకుంది.
....గడచిన నెలన్నర రోజుల కాలంలో వెలుగులోకి వచి్చన ఈ నాలుగు ఉదంతాలు ప్రస్తుతం సమాజంపై ఆన్‌లైన్ గేమింగ్స్ ప్రభావాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ గేమ్స్‌కు అలవాటుపడుతున్న వాళ్లు గెలవడానికి బానిసలుగా మారిపోతున్నారు. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి వివిధ రకాలైన పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి, పందెం కాయడానికి అవసరమైన డబ్బు కోసం అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ ఉచ్చులో పడి మోసాలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.
పథకం ప్రకారం విస్తరించిన గేమ్స్...
కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్‌లైన్ క్లాసులే నడిచాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరించాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేశాయి. వీటికి ఆకర్షితులైన విద్యార్థులు, ఉద్యోగులు, యువత వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఆడటం మొదలెట్టారు. ఆ తర్వాతి రోజుల్లో ఇవి ఆడటం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి తమ ముగ్గులోకి దింపుతారు. వీళ్లకి గెలుపు అనేది ఓ కిక్‌గా మారుస్తారు.
పాయింట్లు, పందేల పేరుతో..
ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. ఇలా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన ఆడేవారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. వీటిని వినియోగిస్తే గేమ్‌లో మీ తరఫున ఆడే క్రీడాకారులు బలంగా మారి, గెలుస్తావంటూ చెబుతారు. తొలుత ఈ పాయింట్లు ఉచితమే అంటూ వాటికీ బానిసలుగా మారేలా చేస్తారు. ఆపై ఈ పాయింట్లు రావాలంటే తమకు కొంత మొత్తం చెల్లించాలంటూ వసూలు చేయడం మొదలెడతారు.
అందినకాడికి దండుకుంటారు...
కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. తమవి లేదా తల్లిదండ్రుల కార్డులు తీసుకుని పేమెంట్లు చేస్తున్నారు. వీటి వివరాలను ఒకసారి నమోదు చేసి, ఆ సందర్భంలో కార్డు యజమానికి వచ్చే ఓటీపీ పొందుపరిచి, ఆటో రీచార్జ్ ఎంపిక చేసుకుంటే పదేపదే కార్డుతో అవసరం ఉండదు. దీంతో అదును చూసుకుని ఈ పని చేస్తున్న యువత అనునిత్యం భారీ మొత్తం ఖర్చు చేసేస్తోంది.
ఇలా మళ్లీ గెలుపు అలవాటు చేసిన తర్వాత తమ వద్ద నిరీ్ణత మొత్తం పందెం కాసి గేమ్ ఆడితే... భారీ లాభాలు ఉంటాయని చెప్పే కంపెనీలు డబ్బు దండుకుంటున్నాయి. ఇలాంటి గేమ్స్‌లో తొలినాళ్లల్లో తక్కువ మొత్తం పెట్టినప్పుడు లా«భం వచి్చనా...పెట్టుబడి పెరిగే కొద్దీ నష్టాలే వస్తుంటాయి. వాటిలో ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆన్‌లైన్ గేమింగ్స్ కోసం యాప్స్‌లో అప్పులు తీసుకుని, ఆ భారం పెరిగిపోయి, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.
పురుషులే ఎక్కువ..
ఇటీవల కాలంలో ఇలాంటి ‘గేమింగ్ ఉదంతాలు’ ఎక్కువగా జరుగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. అయితే తల్లిదండ్రుల, కుటుంబీకుల కార్డ్స్ వినియోగించి యూసీ పాయింట్లు ఖరీదు చేయడం, పందేలు కావడం వంటివి మాత్రం కేవలం పురుషులే చేస్తున్నారు. ఇప్పటి వరకు మా దృష్టికి వచి్చన ఉదంతాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. యువతులు, మహిళలు గేమ్స్ ఆడుతున్నా..డబ్బు చెల్లించాల్సి వస్తే వాటికి దూరంగా ఉంటున్నారు.
– జి.రాజేంద్రన్, సైబర్ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment