న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు ఇవాళ ఢిల్లీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బగ్గా అరెస్ట్ మూడు రాష్ట్రాల పోలీసుల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’గా మారింది. బగ్గా అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే..
50 మంది పోలీసులు.. అరెస్ట్
శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఢిల్లీలో బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 50 మంది పోలీసులు మిస్టర్ బగ్గా ఢిల్లీ ఇంటిలోకి చొరబడి అతడిని అరెస్టు చేశారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ఆరోపించారు. తలపాగా ధరించే సమయం కూడా ఇవ్వకుండా అతడిని బలవంతంగా లాక్కుపోయారని అన్నారు.
కిడ్నాప్ అంటూ కేసు
దాదాపు 10-15 మంది పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి, తన కుమారుడిని కొట్టి బయటకు లాక్కొచ్చారని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ ఆరోపించారు. వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తన ఫోన్‌ను లాక్కున్నారని.. బగ్గా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ ఆయన కేసు పెట్టారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ముందస్తు సమాచారం లేదు
తజిందర్ సింగ్ అరెస్ట్‌పై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అయితే పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఆరోపణను తోసిపుచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చామని.. దీనికి అనుగుణంగానే తమ బృందం ఒకటి గురువారం సాయంత్రం నుంచి జనక్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఉందని వెల్లడించారు.
హరియాణా టు ఢిల్లీ
తజిందర్ సింగ్‌ను మొహాలి తీసుకెళుతుండగా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. తజిందర్ సింగ్ తండ్రి కిడ్నాప్ కేసు పెట్టడంతో ఈ మేరకు వ్యవహరించినట్టు హరియాణా పోలీసులు తెలిపారు. దీంతో హరియాణా నుంచి ఢిల్లీకి తజిందర్ సింగ్‌ను తీసుకొచ్చారు. బగ్గాను కిడ్నాప్ చేయలేదని, తమ రాష్ట్రంలో నమోదైన కేసు ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామని హరియాణా పోలీసు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించినా వినిపించుకోలేదని పంజాబ్ పోలీసులు వాపోయారు.
టార్గెట్ కేజ్రీవాల్
తజిందర్ సింగ్‌పై మొహాలి జిల్లాలోని సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లోని సైబర్ సెల్‌లో కేసు నమోదైంది. విద్వేష ప్రకటనలు చేయడం, మతపరమైన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని ట్విటర్‌లో బగ్గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై కేజ్రీవాల్ స్పందనపై అసంతృప్తితో అతడు రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
విచారణకు సహకరించనందుకే..
బగ్గాపై కేసు వ్యవహారంలో పంజాబ్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఐదుసార్లు నోటీసులు పంపిన తర్వాత కూడా విచారణకు సహకరించేందుకు బగ్గా నిరాకరించడంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, విషపూరితమైన, ద్వేషపూరితమైన పదజాలం వాడుతూ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు.
పంజాబ్ అభ్యర్థనకు హైకోర్టు నో
తజిందర్ సింగ్‌ను హరియాణాలోనే ఉంచాలన్న పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనను పంజాబ్- హరియాణా హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. హరియాణా పోలీసులు బగ్గాను ఢిల్లీ పోలీసులకు అప్పగించడంతో పంజాబ్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హరియాణా పోలీసుల జోక్యం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ (ఏజీ) అన్మోల్ రతన్ సిద్ధూ. హైకోర్టులో వాదించారు. ఢిల్లీ పోలీసులను బగ్గాతో కలిసి హరియాణా సరిహద్దు దాటనివ్వవద్దని కూడా కోర్టును అభ్యర్థించారు. (క్లిక్: సీఎంకు బెదిరింపులు.. బీజేపీ నేత అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment