మదురై డివిజన్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందుల అక్రమ కొనుగోలు వ్యవహారం వెలుగు చూసింది. నిబంధనలను అతిక్రమించి రూ. 27 కోట్లకు కాలం చెల్లిన మందులు, వైద్య సామగ్రిని కొనుగోలు చేసిన అధికారుల బండారం తాజాగా బయట పడింది. వైద్యవిభాగం మాజీ డైరెక్టర్ సహా నలుగురిపై శనివారం కేసు నమోదైంది. వీరిని ప్రశ్నించేందుకు ఏసీబీ పావులు కదుపుతోంది.
సాక్షి, చెన్నై: గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి వ్యవహారాలపై ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల మంత్రులను టార్గెట్ చేసి.. ఏసీబీ సోదాలు చేస్తోంది. అదే సమయంలో ఆరోగ్య శాఖలో భారీస్థాయిలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో డివిజన్ల వారీగా ఏసీబీ వర్గాలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో మదురై డివిజన్ పరిధిలో కాలం చెల్లిన మందులను కొనుగోలు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది.
మాయాజాలం..
ఏసీబీ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు.. 2017లో మదురై డివిజన్ ఈఎస్‌ఐలకు మందుల కొనుగోలుకు రూ.13.12 కోట్లు కేటాయించారు. అయితే, కొన్ని నెలల వ్యవధిలో ఈ మొత్తం రూ. 40 కోట్ల 29 లక్షలకు చేరింది. అంచనా వ్యయం పెరగడమే కాకుండా, ఆగమేఘాలపై మందులను కొనుగోలు చేయడంలో అక్రమాలు వెలుగు చూసినట్లు తేలింది. 2018లో గణంకాల మేరకు రూ. 27 కోట్లు విలువైన మందులు కాలం చెల్లినవిగా తేలింది. ఉద్దేశపూర్వకంగానే వీటిని కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడంతో ఏసీబీ కన్నెర్ర చేసింది.
ప్రభుత్వాన్ని మోసం చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు అప్పటి తమిళనాడు వైద సేవల విభాగం డైరెకర్ట్(ఈఎస్‌ఐ) ఇన్భశేఖర్, మదురై డివిజన్ ఈఎస్‌ఐ నిర్వాహక అధికారి జాన్‌ఆండ్రూ, పర్యవేక్షణాధికారి అశోక్‌కుమార్‌తో పాటు నలుగురిపై ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఐదుగురిని విచారించేందుకు కసరత్తులు చేపట్టారు. అదే సమయంలో పేద కార్మికులు, సిబ్బందికి ఈఎస్‌ఐ ద్వారా కాలం చెల్లిన మందులు పంపిణీ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రూ. 27 కోట్లు విలువైన కాలం చెల్లిన మందులు గోడౌన్లకే పరిమితమై ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శివగంగై జిల్లాలో 2020లో కరోనాకాలం వైద్య సామగ్రి కొనుగోలులో రూ. 60 లక్షలు అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
చదవండి: Viral Video: జస్ట్ మిస్....చిన్నారిపై మూకుమ్మడిగా కుక్కలు ఎటాక్!
Comments
Please login to add a commentAdd a comment