శంకర్‌ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ కన్నుమూత | Sankara Nethralaya founder Dr SS Badrinath passes away at 83 | Sakshi
Sakshi News home page

పద్మభూషన్‌ అవార్డు గ్రహిత, శంకర్‌ నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ కన్నుమూత

Published Tue, Nov 21 2023 10:33 AM | Last Updated on Tue, Nov 21 2023 12:43 PM

Sankara Nethralaya founder Dr SS Badrinath passes away at 83 - Sakshi

శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(నవంబర్‌ 21) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రామ సుగంథన్‌ ధృవీకరించారు.  కాగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్‌ను పద్మభూషన్‌ అవార్డుతో సత్కరించింది. 

దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలలలో ఒకటైన శంకర్‌ నేత్రాలయ స్థాపకుడు. విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్‌ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేసి భారత్‌కు వచ్చిన తర్వాత 1978లో చెన్నైలో ఈ కంటి ఆసుపత్రిని స్థాపించారు. చాలాకాలంపాటు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

బద్రీనాథ్‌ మృతిపై శంకర నేత్రాలయ సంస్థ స్పందిస్తూ.. ‘మా లెజెండ్‌, శంకర నేత్రాలయ స్థాపకుడు డాక్టర్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు బీసెంట్‌ నగర్‌ శ్మశాన వాటికలో జరగనున్నాయి. మా నాయకుడి మరణంపై శంకర్‌ నేత్రాలయ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

చెన్నైలో 1940  ఫిబ్రవరి 24న జన్మించిన సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్.. యుక్తవయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. తల్లిదండ్రుల మృతి అనంతరం  వచ్చిన భీమా డబ్బుతో వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు.  అనంతరం న్యూయార్క్‌లో డాక్టర్‌ వృత్తిని ప్రారంభించి.. అనేక నేత్ర వైద్య కేంద్రాలలో శిక్షణ పొందాడు.

తిరిగి భారత్‌కు వచ్చి 1978లో డాక్టర్ బద్రీనాథ్, వైద్యుల బృందం సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత వైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు. ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతిరోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. కాగా బద్రీనాథ్‌ సతీమణి వాసంతి పీడియాట్రిషియన్‌, హెమటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement