
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): చర్చి ముందు మద్యం సేవించవద్దని చెప్పిన ఓ పాస్టరమ్మపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చారు. బందరు మండలం బొర్రపోతుపాలెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామానికి చెందిన శెట్టి విజయ్‌కర్, ధనలక్ష్మీ అలియాస్ సుజిని(46) కుటుంబ సభ్యులు అదే గ్రామంలో చర్చి నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం ‘ఈస్టర్ పండుగ పర్వదినం’ కావడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా ఇంటికి రావడంతో ఉదయం, మధ్యాహ్నమంతా దేవుని మందిరంలో సంతోషంగా గడిపారు.
ఇంటి నిండా చుట్టాలు ఉండడంతో తాము నిద్రపోయేందుకు స్థలం సరిపోదని భావించిన ఆ దంపతులిద్దరూ తమ మనవళ్లు, మనవరాళ్లను తీసుకుని వారు నిర్వహిస్తున్న చర్చి వద్దకు వెళ్లారు. అదే సమయంలో మట్టా మోషే, మట్టా తిమ్మరాజు అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు చర్చి ఎదుట ఉన్న బల్ల మీద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీంతో ఆమె వారిని వారించింది. వారు ఒక్కసారిగా ఆమెపై తిట్లపురాణం మొదలుపెట్టి గొడవకు దిగారు. ఇంతలో ఆ పక్కనే ఉన్న మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మట్టా లక్ష్మయ్య, మట్టా చింతయ్య వారికి వత్తాసు పలుకుతూ వచ్చి విచక్షణారహితంగా పాస్టరమ్మపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. బందరు ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న బందరు రూరల్ సీఐ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment