పొలంలోని బోర్డుకు తాడు కట్టి ట్రాక్టర్‌తో లాగిస్తున్న టీడీపీ నాయకులు
బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు మితివీురుతున్నాయి. ఇటీవల పొన్నాపురం గ్రామానికి చెందిన దళిత నాయకుడు సుబ్బరాయుడిని హత్య చేశారు. ఆదివారం నాడు ఆర్యవైశ్య సంఘానికి చెందిన సత్యానారాయణశెట్టిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా సోమవారం ఓ వృద్ధురాలి భూమిని కబ్జా చేయడమే కాకుండా.. అదేమని అడిగినందుకు ఆమె చేతి వేళ్లు నరికారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసిం, ఫాతమ్మ దంపతులకు అదే గ్రామంలో 2.80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఖాసిం అనారోగ్యంతో మృతి చెందగా.. ఫాతమ్మ తన ముగ్గురు కుమారులతో కలిసి ఉంటోంది. వారసత్వంగా వచ్చిన ఆ భూమిని ఆమె పెద్ద కుమారుడు హుస్సేన్ పీరా సాగు చేస్తున్నాడు.
ఆ భూమిపై రైతు నగరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బెజవాడ నరేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు కన్నేశారు. మృతిచెందిన ఖాసిం ఆ భూమిని తమకు విక్రయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి.. ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయించుకున్నారు. దీనిపై ఫాతమ్మ, ఆమె కుమారులు నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కాగా.. కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీ నాయకులు ఆ భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఇది తెలుసుకున్న బాధితులు ‘ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది’ అని రాయించిన బోర్డును పొలంలో పెట్టారు.
సోమవారం మధ్యాహ్నం వృద్ధురాలు ఫాతమ్మ పొలంలో పనిచేసుకుంటుండగా.. టీడీపీ నాయకులు ఆమెపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా.. వారిపైనా దాడికి పాల్పడ్డారు. పొలంలో ఉన్న బోర్డును తొలగిస్తుండగా ఫాతమ్మ అడ్డుపడింది. దీంతో టీడీపీ నాయకుడు శ్రీనివాసులు సలిక పారతో ఆమె చేతి వేళ్లను నరికేశాడు. ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చేతి వేళ్లు రెండు పూర్తిగా తెగిపోవటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. ఫాతమ్మ కుమారుడు హుస్సేన్‌పీరా ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు నరేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులుపై నంద్యాల రూరల్ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment