టీడీపీ నాయకుడి ఆక్రమణలపై గతంలో గ్రీవెన్స్‌సెల్‌కు రైతులిచ్చిన ఫిర్యాదు (ఫైల్)
పైచిత్రంలో కనిపిస్తున్న మట్టి రోడ్డు చూశారా.. ఇదేదో మైదాన ప్రాంతంలో వేసినది కాదు. పొలాలకు సాగునీరు అందించేందుకు ఆధారమైన వెంకటబందలో అడ్డంగా నిర్మించిన రోడ్డు. దీనివల్ల ఆయకట్టుకు నీరు అందడం లేదు. పంటలు ఎండిపోతున్నా సదరు టీడీపీ నాయకుడి పొలానికి దారి మాత్రం పక్కాగా సమకూర్చుకున్నాడు.
ఆయనో చోటా నాయకుడు. అయితేనేం.. అధికారాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం చక్కగా వినియోగించుకున్నాడు. సాగునీటికి ఆధారమైన బందను కప్పేసి తన పొలానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మించుకున్నాడు. అప్పట్లో రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేకపోవడంతో టీడీపీ నాయకుడి ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు చెప్పినదే వేదం. వారి దారి అడ్డదారి. అడిగేవారు లేకపోవడంతో ప్రభుత్వ భూములను చెరబట్టారు. తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు. దీనికి జిల్లా కేంద్రమైన విజయనగరానికి సమీపంలోనున్న గంట్యాడ మండలం సిరిపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆక్రమణలే నిలువెత్తు సాక్ష్యం. మండల స్థాయి టీడీపీ నాయకుడొకరు దురాక్రమణలకు తెగబడ్డారు. ఈ ఆక్రమణలను తొలగించాలంటూ స్థానిక రైతులు 28.1.2019వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అప్పటి తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకూ దానికి అతీగతీ లేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా తమ పార్టీ నాయకుల ఆక్రమణలను ఉపేక్షించడంతో అధికారులు కూడా మిన్నకుండిపోయారు.
స్వార్థ ప్రయోజనాల కోసం బాటలు...
సిరిపురం గ్రామ రైతుల సాగునీటి అవసరాలకు వెంకట బంద ఆధారం. దీని నుంచి సమీప గ్రామమైన చంద్రంపేట రైతుల పొలాలకు కొంతమేర సాగు నీరు అందుతుంది. సర్వే నంబర్ 89/1లో 12.70 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంద ఉంది. బంద దాటాక టీడీపీ నాయకుడికి ఆరు ఎకరాల పొలం ఉంది. అక్కడికి సులభంగా చేరుకునేందుకు మూడేళ్ల కిందట బంద మధ్యలోనుంచే రోడ్డు వేయించేశాడు. అతని అధికార దర్పానికి బయపడి స్థానిక రైతులు అడ్డుకోలేకపోయారు. అలాగే, సిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలోనే సర్వే నంబర్ 108/1లోనున్న 22 సెంట్ల ప్రభుత్వ భూమినీ సదరు టీడీపీ నాయకుడు ఆక్రమించేశాడు. ఈ భూమి గుండానే సమీపంలోని తన ఆరెకరాల మామిడితోటకు వెళ్లడానికి అడ్డదారి వేయించాడు. రోడ్డు మరింత వెడల్పుగా ఉండటానికి పక్కనున్న సాగునీటి కాలువనూ జేసీబీలతో కప్పించేశాడు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న మట్టి రోడ్డు కూడా సదరు టీడీపీ నాయకుడి పొలానికి వేసుకున్నదే. అదేదో సొంత స్థలం అనుకుంటే పొరపాటే. అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. అంతేకాదు సాగునీటి కాలువను కప్పేసి మరీ రోడ్డు నిర్మించేశారు.
నాటి టీడీపీ ప్రభుత్వానికి పట్టని రైతుల గోడు..
జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన సదరు మండల స్థాయి టీడీపీ నాయకుడి ఆక్రమణల గురించి రైతులు మొరపెట్టుకున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు రైతుల పొలాలకు సాగునీరు అందట్లేదు. అప్పటి కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. కానీ ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
– గుండ్రపు సత్యారావు, మాజీ సర్పంచ్, సిరిపురం, గంట్యాడ మండలం
మరోసారి సర్వే చేయిస్తాం...
సర్వే నంబర్ 108/1లో 22 సెంట్లు, సర్వే నంబర్ 89/1లో 12.70 ఎకరాల విస్తీర్ణంలోనున్న వెంకట బందలో కొంతమేర ఆక్రమణలు జరిగినట్టు సర్వే రిపోర్టు ఉంది. మరోసారి పరిశీలనకు సర్వేయర్‌ను క్షేత్రస్థాయికి పంపిస్తాం. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
– ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ మండలం
Comments
Please login to add a commentAdd a comment