పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై బండరాయితో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు
సాక్షి, నరసరావుపేట, మాచర్ల: ఎదుట ఉన్నది కూడా మనుషులేనన్న విచక్షణ కోల్పోయి... బలంకొద్దీ బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమి దారుణంగా కొట్టి... మళ్లీ లేవలేనంతగా గాయపరిచారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారం చేశారు. ఇదీ... శుక్రవారం రాత్రి మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాల అత్యంత కిరాకతమైన ప్రవర్తన.
విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని... తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు.
అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే....
తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో ఫెలయింది. ఇక ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
నిజానికి మాచర్లలో రెండు రోజుల క్రితం తాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచరులను అరెస్టు చేస్తారా? అంటూ బ్రహ్మారెడ్డి కొందరితో కలిసి వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డారు. దానికి కొనసాగింపుగానే అన్నట్టుగా... శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసే వంకతో... చుట్టుప్రక్కల ఫాక్షన్ గ్రామాలకు చెందిన తన అనుచరులను ముందే పిలిపించుకున్నారు.
నిజానికి విలేకరుల సమావేశానికి అన్ని ఊళ్ల నుంచి... అంత మంది రావాల్సిన పనిలేకపోయినా... ముందస్తు పథకం ప్రకారం రాడ్లు, కర్రలతో వారిని సిద్ధంగా ఉంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా దుర్బాషలాడుతుండటంతో అక్కడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో తమను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.
వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు చల్లా మోహన్, ఓర్సు కిషోర్, ఉప్పుతోళ్ల శ్రీనివాసరావులపై దాడి చేశారు. వారు కిందపడిపోయినా వదలకుండా కర్రలతో దాడులు చేస్తూ, బండరాళ్లతో బలంగా గుండెలపై కొట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిస్సహాయంగా పడి ఉండిపోవటంతో... నినాదాలు చేస్తూ, ఈలలు వేసుకుంటూ పోలీసులు నచ్చజెప్పినా వినకుండా ప్రదర్శనగా రైలు గేటు వరకూ వెళ్లారు.
ఒకదశలో పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగారు. కొందరు వ్యక్తులు రైల్వే గేటు వద్ద ఓ వాహనాన్ని పూర్తి స్థాయిలో దహనం చేశారు. రింగ్‌రోడ్డులోని మరో వాహనంపై రాళ్లతో దాడిచేశారు. మరో నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు బ్రహ్మారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి గుంటూరు పంపించారు.
కారు, కార్యాలయం దగ్ధం...
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దారుణంగా దెబ్బలు తిని, నిస్సహాయంగా రోడ్డుపై పడిపోయిన విషయం వారి బంధువులు, స్నేహితులకు తెలియటంతో వారు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. తమ వారిని దారుణంగా కొట్టడం, దాదాపుగా హతమార్చే ప్రయత్నం చేయటంతో... వారి బంధుమిత్రులు టీడీపీ కార్యకర్తల జులుంను నిరసించారు.
ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ కారుకు నిప్పు పెట్టారు. జూలకంటి బ్రహ్మారెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిపై కూడా దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు అగంతకులను చెదరగొట్టి... పట్టణంలో 144వ సెక్షన్ అమలులోకి తెచ్చారు. ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటుచేశారు.
పథకం ప్రకారమే... కావాలనే పల్నాడులో మంటలు
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే.
మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడులు సృష్టించేందుకు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌లు పథకం ప్రకారం బ్రహ్మారెడ్డిని మాచర్లకు తీసుకువచ్చారు. నెలవారీ డబ్బులు ఖర్చులకిస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్‌ను బతికించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.
బ్రహ్మారెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చిన నాటి నుంచీ కావాలనే లేనిపోని గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారు. నేను 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇలాంటి అలజడులెప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్య యుతంగా ఎవరైనా ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. కానీ వీళ్లు గొడవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి... తాగి.. మహిళలను తిట్టారు.
ప్రశ్నించిన కార్యకర్తలను బండరాళ్లు, రాడ్‌లతో కొట్టారు. దీనికి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయి. గొడవలు మొదలుపెట్టడమే కాక ఆ తరువాత పెద్ద ర్యాలీలాగా వెళ్లి స్వైర విహారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు చెబుతున్నాను. మీ రాజకీయాల కోసం పల్నాడులో మంటలు రేపుతున్నారు. పల్నాడును తగలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న ఫ్యాక్షన్ ను మళ్లీ రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment