Telangana: Police Caught Infant Baby Selling Gang Khammam - Sakshi
Sakshi News home page

పక్కా సమాచారంతో స్ట్రింగ్‌ ఆపరేషన్‌.. ఆ ముఠా గుట్టురట్టు!

Published Tue, Jun 7 2022 11:33 AM | Last Updated on Tue, Jun 7 2022 12:46 PM

Telangana: Police Caught Infant Baby Selling Gang Khammam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,ఖమ్మం గాంధీచౌక్‌: ఖమ్మం కేంద్రంగా శిశు విక్రయాలు సాగిస్తున్న ముఠా కార్యకలాపాలను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్‌టీఓ), చైల్డ్‌లైన్‌ బృందం బట్టబయలు చేసింది. నవజాత శిశువులతో పాటు అప్పుడే పుట్టిన పసికందులను విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో రంగంలోకి దిగిన బృందం తమకు పిల్లలు కావాలని ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఆతర్వాత డబ్బు చెల్లిస్తామని నమ్మబలుకుతూ ముఠా గుట్టు రట్టు చేయడం విశేషం. ఈమేరకు ముఠా సభ్యులపై ఖమ్మం టూ టౌన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేయగా వివరాలిలా ఉన్నాయి.

పిల్లలు లేని దంపతులే టార్గెట్‌
వివాహమై ఏళ్లు గడిచినా సంతానం కలగని దంపతులు అధికారికంగా దత్తత ప్రక్రియపై అవగాహన లేక ఇతరులను ఆశ్రయిస్తున్నారు. ఇదేఅదునుగా రంగంలోకి దిగిన ముఠా, పిల్లలను పోషించలేని వారి నుంచి తీసుకుని రూ.లక్షల్లో నగదు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో జిల్లాకేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన ఉప్పతల పుల్లారావు, అద్దంకివారి వీధికి చెదిన మోదుగు మేరీ నవజాత శిశువులు, చిన్న పిల్లలను అమ్ముతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్‌ – 1098 కోఆర్డినేటర్‌ కువ్వారపు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన చైల్డ్‌లైన్‌ ఉన్నతాధికారులతో పాటు యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ సీఐ నవీన్, సీడీపీఓ కవితకు తెలిపారు. ఈమేరకు మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు అనూష, నరసింహారావు, భాస్కర్‌ను బృందంగా ఏర్పాటుచేసి స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేయించారు.

వీరు ముగ్గురు మేరీతో పరిచయం పెంచుకుని తమకు పాప కావాలని కోరారు. ఎంత నగదైనా చెల్లిస్తామని చెప్పడంతో ఆమె పలువురు పసిపిల్లల ఫొటోలను వాట్సాప్‌లో పంపించి ధర కూడా వెల్లడించింది. ఇటీవల ఓ పాపను విక్రయించినట్లు చెబుతూ బాండ్‌ పేపర్లపై రాసిస్తామని, భవిష్యత్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పగా అన్ని వివరాలు రికార్డు చేశారు. ఇంతలోనే ఖమ్మం జెడ్పీ సెంటర్‌లోని ఓ ఆస్పత్రిలో కొణిజర్ల మండలానికి చెందిన మహిళ మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, ఆమె డిశ్చార్జి కాగానే పాపను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.4లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్‌గా రూ.1.50లక్షలు ఇవ్వాలని సూచిస్తూ నగదుతో జెడ్పీ సెంటర్‌కు రావాలని చెప్పింది.

ఇందుకు ఒప్పుకున్న అనూష బృందం నగదు, బాండ్‌ పేపర్లతో సోమవారం సాయంత్రం జెడ్పీసెంటర్‌కు వెళ్లగా ఖమ్మం టూ టౌన్‌ పోలీసులు రంగంలోకి దిగి పుల్లారావు, మోదుగు మేరీతో పాటు వీరికి సహకరించిన తలారి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, శిశువును విక్రయించేందుకు ముందుకొచ్చిన ఆమె తల్లి, ఓ ఆస్పత్రి ఉద్యోగి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈసందర్భంగా శిశు విక్రయాల వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించిన చైల్డ్‌లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ప్రతినిధులను చైల్డ్‌లైన్‌ డైరెక్టర్‌ ఎంఎల్‌.ప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ భారతీరాణి తదితరులు అభినందించారు.

చదవండి: రాజాసింగ్‌కు షాక్‌.. పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement