
హత్నూర (సంగారెడ్డి): పెంచి పెద్దచేసిన కొడుకే మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని మంగాపూర్‌లో చోటు చేసుకుంది. మంగాపూర్ గ్రామానికి చెందిన కొండని ఎల్లమ్మ-ఎల్లయ్య దంపతులకు సంతానం లేకపోవడంతో ఓ బాలుడిని తెచ్చుకుని పెంచుకున్నా రు. కొంతకాలానికి ఎల్లయ్య మరణించగా, పెంచిన కొడుకు మహేందర్‌తో కలిసి ఎల్లమ్మ (63) కూలి పనులకు వెళ్తోంది.
ఇదిలా ఉండగా, తన పేరిట ఉన్న 11 గుంటల భూమిని అమ్మగా వచ్చిన డబ్బును ఎల్లమ్మ బ్యాంకులో వేసింది. ఆ డబ్బు కోసం మహేందర్ తల్లిని తరచూ వేధిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి డబ్బు విషయమై తల్లితో ఘర్షణ పడ్డాడు. తాగిన మైకంలో కట్టెతో ఎల్లమ్మ మొహం, తలపై గట్టిగా బాదడంతో తీవ్ర గాయాలపాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయినప్పటికీ ఏం ఎరగనట్టు తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారిని పిలిచి, ‘అమ్మ ఎంత పిలిచినా పలకడం లేదు’అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. మహేందర్ మాటలను విశ్వసించని స్థానికులు అతనిపై దాడి చేయడంతో మహేందర్ తలకు గాయంకాగా, చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment