విశాఖ లీగల్: మాయమాటలతో మోసం చేసి లైంగికదాడి చేసిన యువకుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమాన విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ సోమవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిందితుడు పొట్నూరి గిరీష్ కుమార్ (22) గాజువాక పరిధిలోని మల్కాపురం దగ్గర గుడివాడ అప్పన్న కాలనీలో ఉంటున్నాడు. వృత్తిరీత్యా ప్రైవేటు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ప్రేమాయణం సాగించాడు. యువతికి దగ్గరై శారీరక సుఖం పొందాడు.
పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. మరోవైపు రూ.50వేల వరకూ నగదు తీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి గిరీష్ తల్లిదండ్రులు తిరస్కరించారు. కులాన్ని తక్కువ చేసి దూషించారు. ఈ క్రమంలో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు 2016 ఫిబ్రవరి 22న నిందితునిపై ఎస్సీ, ఎస్టీ చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అప్పటి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రంగనాథం బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏసీపీలు ఎం.రాజారావు, ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నిందితుని తల్లిదండ్రులపై కేసు రుజువు కానందున వారిని నిర్దోషులుగా న్యాయస్థానం విడుదల చేసింది. నేరం రుజువు కావడంతో గిరీష్‌కి న్యాయమూర్తి పైవిధంగా తీర్పు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment