హైదరాబాద్: వేసవి సెలవుల్లో బంధువుల ఇంటికి వచ్చి...తిరిగి ఆనందంతో సొంతూరికి బయలుదేరిన ఓ టెన్త్ విద్యార్థిని రైలుకింద పడి మృత్యువాత పడింది. చెవిలో మొబైల్ హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ చిన్నపాటి నిర్లక్ష్యానికి ఆమె ప్రాణం గాలిలో కలిసిపోయింది.
ఈ విషాదకర సంఘటన నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ –బోరబండ రైల్వే స్టేషన్ల మధ్యలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీదర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ చోటూమియా కుమార్తె మున్నీ బేగం (16) వేసవి సెలవుల్లో కె.ఎస్.నగర్ ప్రాంతంలో నివాసం ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చింది.
ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో కూడా మున్నీ బేగం పాసైంది. పదిహేను రోజుల క్రితం నగరానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో సొంతూరుకు తిరుగు ప్రయాణమైంది. బీదర్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎంఎంటిఎస్ రైలులో బోరబండ రైల్వే స్టేషన్‌లో దిగింది. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ రైలు పట్టాల వెంబడి వెళ్తుండగా ఆమెను గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.
హెడ్‌ఫోన్లు రెండు చెవుల్లో పెట్టుకొని నడవడం వల్ల రైలు శబ్ధం వినపడలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిసింది. దీనిపై స్థానికులు అందించిన సమాచారంతో జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నారు. శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హెడ్‌ఫోన్లు చాలా ప్రమాదకరం
మొబైల్ హెడ్‌ఫోన్లు వాడుతూ రైలు పట్టాల వెంబడి నడవటం, రైలు పట్టాలను దాటడం, ఫోన్లో మాట్లాడుతూ, రైలు ఎక్కడం, దిగడంప్రమాదకరమని నాంపల్లి జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రయాణికులు ఫోన్లు వాడటం వల్ల రైళ్ల రాకపోకల శబ్దాలు వినపడవని, తద్వారా ప్రమాదం జరిగే ఆస్కారం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment