బంజారాహిల్స్(హైదరాబాద్): అణువణువు నిఘా పెట్టేందుకు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌లో రోడ్ నం.12లో నిర్మిస్తు్తన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షల విలువ చేసే 38 రాగి బండిళ్లు (కాపర్ బండిల్స్) చోరీకి గురికాగా దీనిపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్న షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కంపెనీ అడ్మిన్ ఇన్‌చార్జి శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్మాణానికి గాను రాగి బండిళ్లను తెప్పించారు. ఈనెల 2న ప్రాజెక్టు ఇన్‌చార్జి సురేశ్ కృష్ణ అడ్మిన్ ఇన్‌చార్జి నరేందర్‌కు ఫోన్ చేసి 38 రాగి బండిళ్లు కనిపించడంలేదని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అన్ని ప్రాంతాల్లో గాలించిన అనంతరం ఎక్కడా కన్పించకపోవడంతో సంస్థలో పనిచేస్తున్న వారందర్నీ పిలిచి విచారించారు. ఎవరూ తెలియదని సమాధానం చెప్పడంతో శనివారం నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment