కుడుపూడి ప్రేమ్ సాగర్ (ఫైల్) దంగేటి ఫణికుమార్ (ఫైల్) మామిడిశెట్టి బాల వెంకటరమణ (ఫైల్)
అమలాపురం రూరల్(తూర్పుగోదావరి): గోదావరిలో స్నానం చేయాలన్న సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను తీసింది. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆ ముగ్గురు యువకులు తల్లిదండ్రులకు చేతికందొస్తున్న వేళ గోదావరి వారి నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది. స్నేహమేరా జీవితమనుకున్న యువకులను తిరిగి రాని లోకాలకు పంపేసింది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు.. మరణం విషయంలోనూ కలిసే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గౌతమీ నదీ పాయలో బుధవారం జరిగిన ప్రమాదంలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి శివారు శెట్టిపేటకు చెందిన దంగేటి ఫణికుమార్ (19), కుడుపూడి ప్రేమ్‌సాగర్ (17), మామిడిశెట్టి బాల వెంకటరమణ (19) ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కో కుటుంబానిదీ ఒక్కో కన్నీటి కథ
ఫణికుమార్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి కోటేశ్వరరావు దివ్యాంగుడు. పేపర్ ఏజెంట్‌గా శ్రమిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. ఫణికుమార్ రెండో కొడుకు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశ పడుతున్న ఆ కుటుంబానికి ఫణి మృతి తీరని వ్యధ మిగిలింది. ప్రేమ్‌సాగర్ డిప్లమో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంతానం లేకపోవడంతో మునేశ్వరరావు, సూర్యకుమారి దంపతులు ఈ కుర్రాడిని దత్తత తీసుకున్నారు. మూడేళ్ల కిందట సూర్యకుమారి చనిపోయింది. ఆరు నెలల కిందట మునేశ్వరరావు కరోనాతో కన్ను మూశాడు. దీంతో అనాథ అయిన ప్రేమ్‌సాగర్‌ను చిన్నాన్న రామకృష్ణ చేరదీసి పెంచుతున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురూ చనిపోయినట్లయింది. బాల వెంకటరమణ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాసరావు ఆటో నడుపుతాడు. తల్లి పార్వతి కిరాణా దుకాణంలో పని చేస్తోంది. వారికి వెంకటరమణ ఒక్కడే కొడుకు. చేతికందొచ్చే కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ముమ్మిడివరం మండలం అనాతవరంలో బుధవారం మధ్యాహ్నం ఓ వేడుకకు ముగ్గురూ ఒకే మోటారు సైకిల్‌పై వెళ్లారు. మధ్యాహ్న భోజనాలు చేసి దగ్గరలోనే ఉన్న గేదెల్లంక గౌతమీ నది ఉత్తర వాహిన పుష్కర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురూ సరదాగా స్నానం చేద్దామని గోదావరిలోకి దిగారు. స్నానాలు చేస్తున్న సమయంలో ఒకరు తర్వాత ఒకరు గోదావరిలోకి మునిగి పోయి గల్లంతయ్యారు. చివరికి అయినవారికి గుండెకోత మిగిల్చుతూ గురువారం ఉదయం గేదెల్లంక గోదావరిలో శవాలై తేలారు. వారి మృత్యు వార్త విని ఆ మూడు కుటుంబాలే కాదు శెట్టిపేటే కన్నీరు మున్నీరయింది.
చదవండి:
అతి వేగానికి బ్రేకులు..
భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..!
Comments
Please login to add a commentAdd a comment