పోర్నోగ్రఫీ చూసినా... కటకటాల్లోకే! | Two Youngmen Arrest in Search Child Pornography Websites Hyderabad | Sakshi
Sakshi News home page

చూసినా... కటకటాల్లోకే!

Published Mon, Aug 10 2020 6:47 AM | Last Updated on Mon, Aug 10 2020 12:54 PM

Two Youngmen Arrest in Search Child Pornography Websites Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: అభం శుభం ఎగురని చిన్నారులపై లైంగిక దాడులు  జరగడానికి, పెరగడానికి చైల్డ్‌ పోర్నోగ్రఫీ ఓ ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో సాగుతున్న చైల్డ్‌ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్‌ సెక్స్‌వల్‌ అబ్యూజ్డ్‌ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నగరంలోని తార్నాక ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫిరోజ్, కాచిగూడ వాసి ప్రశాంత్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసినా, చూసినా, డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ చేసినా... నేరమే అని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

అమెరికా కేంద్రంగా ఎన్‌సీఎంసీ... 
అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ఎన్‌సీఎంఈసీని ఏర్పాటు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తప్పిపోతున్న చిన్నారులు, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడానికి ఈ సంస్థ పని చేస్తోంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల చిత్రాలు, వీడియోలు, సాహిత్యం తదితరాలను చైల్డ్‌ పోర్నోగ్రఫీగా పరిగణిస్తారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ కార్యకలాపాలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు వయస్సున్న ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు, ప్రతి ఐదుగురు బాలురులో ఒకరు లైంగిక దాడులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్‌ అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనేది అత్యంత వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్‌ అవుతోంది. వివిధ సెర్చ్‌ ఇంజన్లలో జరుగుతున్న సెర్చ్‌ల్లో 25 శాతం చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించినవే. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే 2 వరకు ఇంటర్‌నెట్‌లో  25 వేల చైల్డ్‌ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, చిత్రాలు అప్‌లోడ్‌ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీఎంఈసీ ఆన్‌లైన్, సోషల్‌మీడియాలో ఉన్న చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సాంకేతిక నిఘా వేసి ఉంచుతోంది.  

అత్యంత పటిష్ట నిఘా... 
చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్‌నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్‌ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్‌ ఇంజన్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సోషల్‌మీడియాల్లో ఉన్న సీఎస్‌ఏఎంలను గుర్తించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా సైబర్‌ స్పేస్, సోషల్‌మీడియాల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్‌ఏఎంకు సంబంధించి సెర్చ్‌ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్‌ చేసినా, అప్‌లోడ్‌ చేసినా... అందులో ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ వెంటనే వారు వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ వివరాలను తక్షణం ఎన్‌సీఎంఈకి చెందిన సర్వర్‌కు అందిస్తుంది. వీటిని క్రోడీకరించే అక్కడి సిబ్బంది చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన వివరాలు సెర్చ్‌ చేసిన, చూసిన, అప్‌లోడ్‌ చేసిన, డౌన్‌లోడ్‌ చేసిన వారి వివరాలను ఆయా దేశాల నోడల్‌ ఏజెన్సీలకు అందిస్తారు. మన దేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ వివరాలు ఎన్‌సీఎంఈసీ నుంచి ఎన్సీఆర్బీకి వస్తాయి.  

అరెస్టులు చేసే స్థానిక పోలీసులు... 
ఎన్‌సీఎంఈసీ నుంచి చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిందితుల జాబితా అందుకున్న ఎన్సీఆర్బీ అధికారులు ఆ వివరాలను రాష్ట్రాల వారీగా విభజించి, ఆ సమాచారాన్ని ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. 2019లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ అప్‌లోడ్‌ చేసిన తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఇటీవల ఎన్సీఆర్బీ నుంచి రాష్ట్ర సీఐడీ అధికారులకు అందగా..   వీరు ఆ నిందితుల జాబితాలను ఆయా స్థానిక పోలీసులకు పంపించారు. ఇలా ఇద్దరి వివరాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అందగా..  ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించారు. గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లోకి ఓ చైల్డ్‌  పోర్న్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన తార్నాక వాసి మహ్మద్‌ ఫిరోజ్, చిన్నారుల అశ్లీల చిత్రాలను ఓ సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసిన కాచిగూడ వాసి ప్రశాంత్‌ కుమార్‌ను ఇలానే పట్టుకున్నారు. వీరిద్దరిని గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన 13 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో ఆయా జిల్లాల పోలీసులకు ఆ సమాచారం సీఐడీ ద్వారా అందింది. వీరినీ అరెస్టు చేయడానికి సన్నాçహాలు జరుగుతున్నాయి. ఈ 15 మందీ తమ ఫోన్ల ద్వారానే ఇంటర్‌నెట్‌ను యాక్సస్‌ చేశారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం  
‘చైల్డ్‌ పోర్నోగ్రఫీని ఎవరు సెర్చ్‌ చేసినా చర్యలు తప్పవు. ఎన్సీఆర్బీ ద్వారా అందిన సమాచారంతో సుమోటో కేసుల్ని నమోదు చేస్తున్నాం. వీరిపై ఐటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 67 (బి) ప్రకారం ఆరోపణలు రిజిస్టర్‌ అవుతున్నాయి. ఈ కేసులో నేరం నిరూపణ అయితే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే దీంతో పాటు పోక్సో యాక్ట్‌ కింద కేసులు నమోదవుతాయి. వీటిలో కోర్టు దోషులుగా నిర్థారిస్తే జీవితఖైదు వరకు పడే ఆస్కారం ఉంది.   – ఎన్‌.మోహన్‌రావు, ఇన్‌స్పెక్టర్, సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement