
లక్నో: సరదాగా సాగిపోతున్న వివాహ వేడుకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి హాజరైన పదో తరగతి విద్యార్థి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఆగ్రాలోని ఖండౌలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఖండౌలిలో గురువారం వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో అతిథిగా అక్కడకు వచ్చిన ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి తన వెంట లైసెన్స్‌డ్ గన్ తెచ్చుకున్నాడు.
వివేక్ అనే యువకుడు.. ఓసారి గన్ చూస్తానని ఆర్మీ అధికారిని కోరాడు. అయితే, ఆ గన్ లోడ్ చేసి ఉండటంతో... వివేక్ అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కాడు. దాంతో ఒక బుల్లెట్ పెళ్లిలో ఉన్న ధర్మేంద్ర సింగ్ (16) ఛాతీలోకి దూసుకెళ్లింది. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో సందడిగా ఉన్న పెళ్లి వేడకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అయితే, ఇది అనుకోకుండా జరగిన ఘటన కాదని, కావాలనే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment