ప్రతీకాత్మక చిత్రం
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): భర్త రోజూ మద్యం సేవించి వచ్చి వేధిస్తున్నాడు. భార్య అతని వేధింపులు తాళలేక మంగళవారం తెల్లవారుజామున రోకలిబండతో నెత్తి మీద మోది హత్య చేసింది. ఈ సంఘటనపై మృతుడి చెల్లెలు లక్ష్మీదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని నకాష్ వీధిలో పోలూరి సుబ్బనరసయ్య(45), అతని భార్య సుజాత(41), కుమార్తె మేఘన (9) నివాసం వుంటున్నారు. వెదురు బుట్టలు అల్లుకుని జీవనం సాగించే వారు. ఈక్రమంలో సుబ్బనరసయ్య సాయంత్రం అయ్యే సరికి మద్యం సేవించి వచ్చి భార్య సుజాతను వేధించేవాడు.
చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. యంగ్ హీరో అరెస్ట్!
ఈక్రమంలో వీరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయిలో నెలకొన్నాయి. రెండు నెలలుగా కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణదేవరాయలునగర్‌లో నివాసం వుంటున్న తన అన్న కొండయ్య ఇంటిలోనే కుమార్తెతోపాటు తలదాచుకుంటోంది. అన్న కొండయ్య తిరుపతిలోని రుయా హాస్పిటల్‌లో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను ప్రతి సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి శనివారం సాయంత్రం కడపలోని ఇంటికి వస్తాడు.
సోమవారం ఉదయం కొండయ్య విధులకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మద్యం సేవించిన సుబ్బనరసయ్య మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తన భార్య సుజాత, కుమార్తె మేఘన ఉన్న శ్రీకృష్ణదేవరాయనగర్‌లోని కొండయ్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కొండయ్య భార్య, పిల్లలు, సుజాత, ఆమె కుమార్తె వున్నారు. మద్యం మత్తులో వెళ్లిన సుబ్బనరసయ్య సదరు ఇంటికి వెళ్లి తలుపులు తెరవాలని బలవంతం చేశాడు.
తలుపు తీసిన వెంటనే కొంతసేపు భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్త సుబ్బనరసయ్య తలపై భార్య సుజాత రోకలి బండతో చితకబాదింది. రక్తపుమడుగులో వున్న సుబ్బనరసయ్యను చూసిన స్థానికులు రిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని, సంఘటన స్థలాన్ని చిన్నచౌక్ సీఐ కె. అశోక్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రామసుబ్బారెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సంఘటనపై మృతుడి చెల్లెలు లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment