వరంగల్: బండరాయితో తలపై మోది మహిళను అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో ఆదివారం ఉదయం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లారుగూడ రెవెన్యూ శివారు వంజరపల్లికి చెందిన కౌడగాని శంకర్‌రావు రోజు మాదిరిగా ఉదయం గేదెలను తోలుకుని వ్యవసాయబావి వద్దకు వెళ్తున్నాడు.రోడ్డు పక్కన వెళ్తుండగా దూడ ఒక్కసారిగా బెదిరింది. అటుగా చూడడంతో తప్పెట్ల ఎల్లయ్య వ్యవసాయ భూమి వద్ద మహిళ రక్తపు మడుగులో మృతదేహం కన్పించింది. వెంటనే సర్పంచ్ భర్త పెంతల అనీల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై భరత్ చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, మామునూర్ ఏసీపీ కృపాకర్, పర్వతగిరి సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద లభ్యమైన పర్సులో రూ 5,280 నగుదు, ఐదు రూపాయల కాయిన్, రోడ్డుపై పగిలిన గాజులు, ఒక కాలి చెప్పు, కాలిపట్టాతో పాటుగా మృతురాలి వేలిముద్రలు, రోడ్డుపై పడిన రక్తంను సేకరించారు. మృతదేహం ఎడమపక్కన కనుబొమ్మ, ముక్కు, కణతపై కింది పెదవిపై బండరాయితో మోదినట్లు బలమైన గాయాలున్నాయి.
శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఎవరో మెడకు స్కార్‌్ఫతో ఉరివేసి ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో మోది చంపి రోడ్డు పక్కన పడవేసినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతురాలు నల్లబెల్లి శివారు జగ్గునాయక్ తండాకు చెందిన జర్పుల శౌరి(45)గా బంధువులు గుర్తుపట్టినట్లు తెలిపారు. శౌరి భర్త స్వామి 12 ఏళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమారులు సురేష్, వెంకటేష్ ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్‌కు భార్య అనూష, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వంజరపల్లి సర్పంచ్ భర్త అనీల్ ఫిర్యాదు మేరకు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ కేసునమోదు చేసుకుని హత్యకు కుటుంబకలహాలా లేదా మరే ఇతర కారణాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment