ముంబై: ముంబైలోని అక్షా బీచ్‌లో గోనె సంచిలో వారం రోజుల క్రితం ఓ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. గోనె సంచిలోని మృతదేహం ఈస్ట్ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందినిగా గుర్తించిన పోలీసులు మిస్టరీ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నందిని మామగా పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ కాందివ్లీకి చెందిన పంకజ్‌ని మూడు సంవత్సరాల క్రితం నందిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పంకజ్ వాళ్ల తండ్రి కమల్ రాజ్‌కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేగాక ఆమె క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్నాడు. చదవండి: గోనె సంచిలో మహిళ శవం.. ఎవరిదో తెలిసింది
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పని నిమిత్తం పంకజ్ వేరే ఊరికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మామ కమల్ రాజ్ కోడలిని ఎలా అయినా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. దీంతో డిసెంబర్ 9న కమల్.. ఇద్దరు స్నేహితులతో కలసి నందిని నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతులు కాళ్లు కట్టేసి దిండుతో నొక్కి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ప్యాక్ చేసి దానిని కండివిల్లి ప్రాంతంలోని నాలాలో విసిరేశారు. డిసెంబర్ 24న మృతదేహం కలిగిన గోనె సంచి ఆక్షా బీచ్‌కు చేరుకుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసులో మామతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment