మహారాష్ట్రలొ మహిళా సంఘం నేత హత్యోదంతం కలకలం రేపింది. స్వల్ప వివాదం కారణంగానే మహిళ ఎన్‌సిపి కార్యకర్త, స్థానికంగా మహిళా హక్కులకోసం పనిచేస్తున్న మహిళా సంఘం నేత రేఖ భూసాహెబ్ జారేపై సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు రేఖ పూణే నుంచి అహ్మద్‌నగర్‌కు కారులో వెళుతున్నారు. ఆమెతోపాటు, తల్లి, కొడుకు, స్నేహితుడు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బైక్‌ను క్రాస్ చేసిన ముందుకెళ్లడమే ఆమె చేసిన నేరం. ఆగ్రహంతో రగిలిపోయిన ఇద్దరు నిందితులు తమ బైక్‌వేగం పెంచి కారుకంటే ముందుకు దూసుకెళ్లారు. రోడ్డు మధ్యలో బైక్ నిలిపి ఈమెను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులోని ఇతర కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని, సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఒక దుండగులు అకస్మాత్తుగా కత్తి దూసి, రేఖ గొంతు కోసి అక్కడినుంచి ఉడాయించారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఈ ఘటనలో అహ్మద్‌నగర్ సుపా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదైందని, ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment