ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’  | Woman Suicide With Her 2 Children In Rajendra Nagar Over Husband Harassment | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’ 

Published Sat, Dec 11 2021 7:46 PM | Last Updated on Sun, Dec 12 2021 8:20 PM

Woman Suicide With Her 2 Children In Rajendra Nagar Over Husband Harassment - Sakshi

రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌): భార్యాభర్తల మధ్య గొడవలు.. ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తనకు తన పిల్లలంటే ఇష్టమని, వారినీ వెంట తీసుకుపోతున్నానని సూసైడ్‌నోట్‌ రాసింది. మొదట కొడుకు, బిడ్డ ఇద్దరికీ ఉరివేసింది. వారు చనిపోయాక బెడ్‌పై పడుకోబెట్టి.. తానూ ఉరివేసుకుంది. హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 

యూసుఫ్‌గూడకు చెందిన సాయికుమార్, స్వాతికుసుమ ఇద్దరూ గతంలో ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి ప్రాంతంలోని ఫోర్ట్‌ వ్యూ కాలనీలో కాపురం పెట్టారు. పెళ్లయిన 6 నెలలకు గర్భవతి కావడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. తర్వాత వారికి కుమారుడు తన్విక్‌ శ్రీ (4), కుమార్తె శ్రేయ (రెండున్నరేళ్లు) పుట్టారు.

కుమార్తె పుట్టనప్పటి నుంచి సాయికుమార్‌ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల నుంచి బంగారం, డబ్బులు తీసుకురావాలని స్వాతిపై ఒత్తిడితెచ్చాడు. ఒకట్రెండు సార్లు స్వాతి డబ్బులు తీసుకురావడంతో ఇది అలవాటుగా మారింది. స్వాతి తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోవడంతో.. ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా తానేనని, ఆస్తులన్నీ తనకు రాసివ్వాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. జల్సాలకు అలవాటు పడి స్వాతి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టాడు, కొన్నింటిని అమ్మేశాడు. దీనితో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు సాగుతున్నాయి.

ఈ క్రమంలో స్వాతికుసుమ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి పిల్లలను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకుంది. శుక్రవారం రాత్రంతా బయటికి వెళ్లొచ్చిన సాయికుమార్‌.. శనివారం సాయంత్రం దాకా ఏమీ పట్టించుకోలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లి బెడ్రూం తలుపుతట్టినా లోపలి నుంచి ఏ స్పందనా రాలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా.. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్వాతి తల్లిదండ్రులు శారద, జగన్నాథం, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు.

చదవండి: (మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్‌ కొడుకు.. 3 నెలలుగా..)

గోడపై సూసైడ్‌ నోట్‌
స్వాతి తొలుత పిల్లలు తన్విక్‌శ్రీ, శ్రేయలకు చీరతో ఉరివేసి.. బెడ్‌పై పడుకోబెట్టి, తర్వాత తాను ఉరివేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, ఆ నివేదిక వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా.. ఆత్మహత్యకు ముందు స్వాతి బెడ్రూం గోడపై రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ‘‘నా భర్త శాడిస్టు, సైకో.. బాగా ఏడిపిస్తున్నాడు.

సరిగా చూసుకోవడం లేదు. ఊరంతా అప్పులు, మా బంగారం కూడా అమ్మేశాడు. ఐ డోంట్‌ లైక్‌ హిజ్‌ డిస్‌రెస్పెక్టివ్‌ టువర్డ్స్‌ అవర్‌ ఫ్యామిలీ. అతడిని నేను ఇంకా భరించలేను. లవ్‌ యూ అమ్మా, నాన్నా. మీరే మీ బాధపడకండి. నా పిల్లలు అంటే నాకు పిచ్చి. నేను లేనిదే వాళ్లను ఎవరూ చూసు కోరు. అందుకే తీసుకోని పోతున్నా..’’ అని ఆ సూసైడ్‌ నోట్‌లో ఉంది. స్వాతి భర్త సాయికుమార్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement