గన్నవరం: రెండేళ్ల క్రితం అనుమానానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహిత మృతదేహానికి మంగళవారం స్థానిక ముస్లిం శ్మశానవాటికలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...స్థానిక ఇస్లాంపేటకు చెందిన సఫియాబేగంకు 2015లో విజయవాడకు చెందిన సలిముల్లా షరీఫ్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం గుంటూరులోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న సఫియాబేగం 2020 సెప్టెంబర్ 6 న ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందింది.
అనంతరం మృతదేహాన్ని గన్నవరం తీసుకువచ్చి ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత సఫియాబేగం మృతిపై అనుమానాలు రావడంతో సెప్టెంబర్ 19న ఆమె తల్లిదండ్రులు గుంటూరు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. సఫియాబేగం మృతికి ఆమె భర్త సలిముల్లా షరీఫ్‌తో పాటు అత్తమామలు కారణమంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పురోగతి లేకపోవడంతో పాటు ఆరేళ్ల కుమారుడిని పట్టించుకోకుండా షరీఫ్ మరో పెళ్లి చేసుకోవడంతో ఇటీవల మృతురాలి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
కమిషన్ ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం తహసీల్దారు సీహెచ్ నరసింహారావు సమక్షంలో పట్టాభిపురం సీఐ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంలోని పలు అవశేషాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment