ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్‌లో శనివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశాడు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన వనం సుధాకర్‌కు ఇద్దరు కుమారులు కార్తీక్, వనం రాకేశ్(26) ఉన్నారు. రాకేశ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్నాడు.
శనివారం స్కూల్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్‌లో ఉన్న మరుపల్లి నిఖిల్ బేకరికి వెళ్లాడు. అక్కడ నిఖిల్, శ్రీనాథ్, వంశీలతో రాకేశ్ మాట్లాడుతుండగా కడిపికొండ నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు నిఖిల్ బేకరి ఎదుట మూత్ర విసర్జన చేశారు. ఈక్రమంలో నిఖిల్, రాకేశ్ మూత్రవిసర్జన చేసిన యువకులను నిలదీశారు. దీంతో నువ్వు ఎవడివిరా అంటూ షాపు నిర్వాహకుడిని ప్రశ్నిస్తూ బైక్‌పై వచ్చిన వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇంతలో బైక్‌పై వచ్చిన గాడుదల రాజేశ్‌తోపాటు మరో వ్యక్తి ఫోన్ చేసి బంటి, యోగి భాస్కర్‌ను పిలుపించుకున్నారు.
ఓ పక్క ఇరువురు మాట్లాడుతుండగానే గాడుదల రాజేశ్ తన వద్ద ఉన్న కత్తి తీసి రాకేశ్‌ను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈక్రమంలో అడ్డుకోబోయిన నిఖిల్, శివపై దాడి చేశాడు. దీంతో నిఖిల్ కుప్పకూలాడు. శివ పారిపోతుండగా వెంటపడి కత్తితో దాడి చేశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత రాజేశ్ కత్తి చూపిస్తూ అడ్డువస్తే అందరికీ ఇదే గతి పడుతోందని హెచ్చరిస్తూ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. శివ మిల్స్‌కాలనీ పోలీసులతో పాటు గాయపడిన నిఖిల్ తల్లిదండ్రులు, రాకేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం)
రాకేశ్, నిఖిల్‌ను 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాకేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిఖిల్‌ను ఎమర్జెనీ వార్డుకు తరలించారు. మృతుడి సోదరుడు వనం కార్తీక్ ఆదివారం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. కాగా, స్నేహితుల వద్దకు వెళ్లకుంటే బతికేవాడి బిడ్డా అంటూ వనం రాకేశ్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
పాతకక్షలే కారణమా..?
రాకేశ్ హత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇరువురు యువకుల మధ్య పాతకక్షలు ఉన్నాయా..?, క్షణికావేశంలో కత్తితో దాడి చేశారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కాగా, ఇరువురి మధ్య పాతకక్షలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పోలీసు కస్టడీలో నిందితుడు
యువకుడి హత్య కేసుతో సంబంధమున్న ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడు శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన గాడుదల రాజేశ్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, అతడితోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నట్లు విశ్వనీయంగా తెలిసింది. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment