యువతి ఫొటోలు మార్ఫింగ్‌! | Young Woman Photos Morphed In Ongole, Threatened Her By Sending Photos, More Details About This Case | Sakshi
Sakshi News home page

యువతి ఫొటోలు మార్ఫింగ్‌!

Published Mon, Aug 26 2024 5:14 AM | Last Updated on Mon, Aug 26 2024 9:31 AM

Young woman photos morphing

ఆమెకే ఫొటోలు పంపి బెదిరింపులు

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ఒక యువకుడు మాత్రమే అరెస్ట్‌ 

టీడీపీ నేతల ఒత్తిడితో ఇద్దరిని వదిలేశారని ఆరోపణలు 

కేసు విచారణ కొనసాగుతోందన్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తెనాలి రూరల్‌: ఒకవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ, వైద్య రంగంలోనే ఉన్న ఓ యువతి ఫొటోలను టీడీపీ నాయకుడి తమ్ముడు, మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్‌ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... తెనాలికి చెందిన ఓ యువతి వైద్య రంగంలో స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ టెక్నీషియన్‌గా చేస్తున్నారు. 

ఆమె ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేశారు. వాటిని కొరియర్‌ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. దీంతో బాధితురాలు రెండు వారాల  కిందట తెనాలి టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్‌ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ను ఐదు రోజులు కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

కానీ, హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన భరత్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరినీ గుట్టుగా తమ స్వస్థలాలకు పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇద్దరు నిందితులను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు  తెలుస్తోంది.

హైదరాబాద్‌ లింక్‌పై విచారణ ఏదీ? 
అబ్దుల్‌ సత్తార్, కరుణాకర్, భరత్‌ హైదరాబాద్‌ కేంద్రంగా కొన్నేళ్ల నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. తెనాలి పోలీసుల విచారణలో వీరి వద్ద అనేకమంది యువతులు, మహిళల నగ్న చిత్రాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 

నిందితుల్లో ఒకరు ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నిందితులను వదిలిపెట్టినట్లు సామాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.

కేసు దర్యాప్తు పూర్తి కాలేదు  
ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసులో ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేశాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమంది నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సున్నితమైన అంశాలు ఉండడంతో పూర్తి వివరాలను అప్పుడే వెల్లడించే అవకాశం లేదు.  – ఎ.సుధాకర్, తెనాలి టూ టౌన్‌ సీఐ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement