
అక్కడో మాట.. ఇక్కడో మాట
రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం
ప్రాంతాల వారీగా మభ్య పెట్టే ప్రకటనలు
అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాతి మాట
టీడీపీ పాలనలో అప్పులు రూ.3.5 లక్షల కోట్లు
విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని కూటమి ఎంపీ భరత్ అభ్యర్థి వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరోసారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజధానిపై బుధవారం దినపత్రికల్లో కూటమి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కాణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజధానిపై ప్రాంతాల వారీగా రెండు రకాల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది.
సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడు
విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమని ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్ తేల్చి చెప్పారు.
అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్ ఇంజన్ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్ చెప్పారు.
అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్ ఇంజన్ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది.
రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!
తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖ ఎడిషన్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపుచ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖలో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్ ఫొటోలున్నాయి. విజయవాడ ఎడిషన్లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వగా విశాఖలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
ఓ విధానం లేకుండా..
జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విషయంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రకంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయడమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాలవారీగా మభ్యపెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయాలంటే రూ.లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్సీపీ వాస్తవిక దృక్పథంతో చెబుతోంది.
అదే విషయాన్ని ఇప్పుడు ఓట్ల కోసం భరత్ వల్లె వేయడం గమనార్హం. రాజధాని అమరావతి సాధ్యం కాదని పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో విజయవాడ భాగమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మాత్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచార ప్రకటనలు జారీ చేయటాన్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది.